జ్యురిచ్: వచ్చే ఏడాది జనవరి నాటికి వరల్డ్ కప్ నిర్వహణ నియమ నిబంధనల్లో సంస్కరణలు తెచ్చేందుకు చేసిన మూడు ప్రతిపాదనలపై 'ఫిఫా' కార్యవర్గం తుది నిర్ణయం తీసుకోనున్నదని సమాఖ్య అధ్యక్షుడు జియాన్నీ ఇన్ ఫాంటినయో తెలిపాడు. ఫిఫా వరల్డ్‌కప్‌ను లాభదాయక టోర్నమెంట్‌గా మార్చడం ఎలా అన్నదే ప్రధాన అంశమని తెలిపాడు.
32 టీంలతో కూడిన టోర్నమెంట్ బాగానే ఉన్నా.. ఆదాయం పెంపొందించుకొనేందుకు మరికొన్ని దేశాలకు చోటు కల్పించాల్సి ఉందన్నాడు. ప్రతిపాదిత నూతన ఫార్మాట్ 2026 నాటికి ఖరారు కావాల్సి ఉందన్నాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశంలో రెండు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయన్నాడు.
ఐదు టీంలతో 8 గ్రూపులు, నాలుగు టీంలతో 10 గ్రూపులతో గానీ నిర్వహిస్తే ఎలా వుంటుందన్న ప్రతిపాదన ముందుకు వచ్చిందని తెలిపాడు. కొత్తగా చేరే 32 టీంలు అదనంగా ప్రతిపాదించిన నూతన ప్రీ టోర్నమెంట్ ప్లే ఆఫ్‌లో పోటీ పడాల్సి ఉంటుంది. ఆ తర్వాతే 48 జట్లతో కూడిన ప్రతిపాదనలో 16 గ్రూపుల్లోని విజేతలు క్వాలిఫైయింగ్ రౌండ్‌కు చేరుకుంటారని తెలిపాడు.
ప్లే ఆఫ్ నుంచి 16 జట్లు యధావిధిగా ముందుకెళ్తాయని తెలిపాడు. తాము పూర్తి పారదర్శక విధానంతో ముందుకెళుతున్నామని ప్రతి అంశం మారుతుందని తెలిపాడు. టోర్నమెంట్‌ను విస్తరించాలన్న లక్ష్యంతో తాము ముందుకెళుతున్నామని చెప్పాడు. ఫిఫా వరల్డ్ కప్ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని స్పష్టంచేశాడు. దీనికి తోడు ఫిఫాలో వరల్డ్ కప్ సహా సభ్య దేశాలకు సభ్యత్వం కల్పిస్తామన్నాడు.

2018 ఫిఫా వరల్డ్ కప్ నిబంధనలు ఖరారు:
మరో రెండేళ్లలో 2018లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ నియమ నిబంధనలకు ఫిఫా కార్యవర్గం ఆమోదం తెలిపిందని రష్యా క్రీడాశాఖ మంత్రి విటలే ముట్కో తెలిపాడు. ఫిఫా సహకారంతో రష్యా 2018 వరల్డ్ కప్ టోర్నమెంట్ కు ఆతిథ్యమిస్తున్నది. ఫిఫా కప్ మార్కెటింగ్ తదితర అంశాలపై రూపొందించిన మార్గదర్శకాలు, నిబంధనలను వచ్చే ఏడాది మీడియాకు తెలియజేస్తామన్నాడు.
2017 ఫిఫా కాన్ఫిడరేషన్స్ కప్ వచ్చే ఏడాది జూన్ 17 నుంచి జూలై రెండో తేదీ వరకు రష్యాలోని ఓట్ర్కీటై, జెనిత్, సోచిలోని ఫిస్ట్, కజన్ లోని కజాన్ స్టేడియంలలో జరుగుతాయి. ఈ ఏడాది నవంబర్ 26న టోర్నమెంట్ లో పాల్గొనే మ్యాచ్ డ్రాలు తీస్తామన్నాడు. ఫిఫా పూర్తిస్థాయి వరల్డ్ కప్ నిర్వహణకు ముందుటేడాది కాన్ఫిడరేషన్ కప్ ఒకే దేశం ఆధ్వర్యంలో జరుపాలని ఫిఫా సదస్సు నిర్ణయించింది. 2017, 2021 ఫిఫా కాన్ఫిడరేషన్ కప్ ల నిర్వహణకు రష్యా క్రీడా మంత్రి విటలే ముట్కో ఇన్ చార్జీగా ఉన్నాడు.
19 నుంచి యు - 17 వరల్డ్ కప్ ఏర్పాట్లపై ఫిఫా తనిఖీలు:
భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జరిగే యు-17 వరల్డ్ కప్ టోర్నమెంట్ నిర్వహణ ఏర్పాట్లను ఫిఫా ప్రతినిధులు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు తనిఖీ చేస్తారు. దేశవ్యాప్తంగా మ్యాచ్‌లు జరిగే వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. 13 మంది సభ్యులు ఫిఫా ప్రతినిధులు ఈ తనిఖీల్లో పాల్గొంటారు. ఈ టీమ్‌కు మారియన్ మేయర్ వర్ఫీల్డర్ (ఫిఫా యు-17 వరల్డ్ కప్ భారత్ 2017 ఈవెంట్ మేనేజర్), ట్రేసీ లూ (ప్రాజెక్ట్ లీడ్, యు-17 వరల్డ్ కప్ భారత్ 2017) నాయకత్వం వహిస్తారని లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రాజెక్టు డైరెక్టర్ జాయ్ భట్టాచార్య తెలిపారు.
ఫిఫా తనిఖీ షెడ్యూల్ ఇది:
19 అక్టోబర్ - కోచి
20 అక్టోబర్ - నవీ ముంబై
22 అక్టోబర్ - గోవా
23 అక్టోబర్ - న్యూఢిల్లీ
24 అక్టోబర్ - గౌహతి
25 అక్టోబర్ - కోల్ కతా