ఫాటోర్డా: ఐఎస్ఎల్ 3 ఎడిషన్ మలి విడత మ్యాచ్‌ల్లో అసాధారణ, అద్భుతమైన ఫలితాలు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం చివరి క్షణంలో ముంబైపై పుణె జట్టు విజయం సాధిస్తే.. అదేబాటలో శుక్రవారం సాయంత్రం ఫాటోర్డాలో జరిగిన మ్యాచ్‌లోనూ నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుపై ఎఫ్‌సి గోవా జట్టు 2 - 1 స్కోర్ తేడాతో గెలుపొందింది.
ఫస్టాఫ్‌లో రెండు జట్లూ కూడా ఒక్క గోల్ చేయలేదు. సెకండాఫ్ లో 50వ నిమిషంలో నార్త్ఈస్ట్ కుర్రాడు సైత్యాసింగ్ గోల్ కొట్టి ఖాతా ప్రారంభించిన తర్వాత గోవా ప్లేయర్లు కళ్లు తెరిచారు. తద్వారా 60వ నిమిషంలో రాబిన్ సింగ్, 90వ నిమిషంలో రోమియో ఫెర్నాండెజ్ గోల్స్ చేయడంతో జట్టు విజయం ఖరారైంది. విజయం కోసం చకోరా పక్షి మాదిరిగా ఎదురుచూస్తున్న గోవాకు ఈ విజయం ఊరటనిచ్చింది. పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నా 10 పాయింట్లు సాధించడం విశేషమే.
నార్త్ఈస్ట్ చాలా పాజిటివ్ నోట్ తోనే జట్టును ప్రారంభించింది. మూడో నిమిషంలో వింగాడ శిష్యులు పంపిన బంతిని గోవా గోల్ కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి విజయవంతంగా అడ్డుకున్నాడు. మరోసారి మైల్సన్ అల్వెకు సమీపం నుంచి కస్తుమి యుసా పంపిన బంతిని గోల్ కీపర్ కట్టిమణి మరోసారి తిరగ్గొట్టాడు. అవకాశాలు కలిసి వచ్చినా నార్త్ఈస్ట్ ఆటగాళ్లు సైతం ముందుకు దూసుకెళ్లలేకపోయారు. గుస్తావో లాజరెట్టి ద్వారా బంతిని అందుకు కొట్టిన కిక్ తో అది క్రాస్ బార్‌ను దాటిపోయింది.

తర్వాత అల్వెస్ హెడర్ ద్వారా పంపిన బంతిని లక్ష్యాన్ని చేరుకోలేదు. రాబర్ట్ కుల్లెన్ పంపిన బంతిని మరోసారి కట్టిమణి కట్టడి చేయడంతో నార్త్ఈస్ట్ గోల్కు చాన్స్ లభించడం లేదు. ఎఫ్ సి గోవా కుర్రాళ్లు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విఫలం అయ్యారు. ఫలితంగా ప్రారంభంలో నార్త్ఈస్ట్ కుర్రాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం చిక్కింది. రెండు జట్ల శక్తి సామర్థ్యాలతో పోలిస్తే నార్త్ఈస్ట్ ఒకింత శక్తిమంతమైన జట్టే. రాఫెల్ కొయెల్హో, త్రిండాడే గోంగ్కేల్వ్స్, రాబిన్ త్రయం దూసుకువెళ్లినా నార్త్ఈస్ట్ డిఫెన్స్ ముందు గోల్ కొట్టడం అసాధ్యంగా మారింది.
సెకండాఫ్‌లో ఇరు జట్లు ఆచితూచి ముందుకు సాగాయి. మిడ్ ఫీల్డ్‌లో పరస్పరం ఆధిపత్యం సాధించేందుకు పోటీ పడ్డారు. 50వ నిమిషంలో నార్త్ఈస్ట్ కుర్రాడు సైత్యాసేన్ గోల్ కొట్టేవరకు పరిస్థితి ఒకింత గుంభనంగానే ఉన్నది. రాబిన్‌సింగ్ హెడర్ ద్వారా పంపిన బంతిని అందుకున్న కస్తుమి యుసా దాన్ని సైత్యాసింగ్ కు పాస్ చేశాడు. అతడు గోల్ కొట్టడంతో ర్త్ఈస్ట్ ఆధిక్యం సాధించింది. దీంతో గోవన్లలో కసి చెలరేగిపోయింది. రాబిన్ 62వ నిమిషంలో చాలా సింపుల్‌గా బంతిని గోల్ పోస్ట్‌కు పంపి స్కోర్‌ను సమం చేశాడు.
ఆ తర్వాత నార్త్ఈస్ట్ ఆటగాళ్లు మళ్లీ పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నాలను గోవా గోల్ కీపర్ కట్టిమణి విజయవంతంగా తిప్పికొట్టాడు. ప్రత్యేకించి నికోలస్ వెలెస్ పంపిన పవర్ ఫుల్ వ్యాలీని సేవ్ చేయడంతో నార్త్ఈస్ట్ ఆధిక్యం సాధించే అవకాశాన్ని కోల్పోయింది. మ్యాచ్ పై పట్టు సాధించి త్వరితగతిన లక్ష్యాన్ని సాధించాలన్న వేగంలో సాహిల్ తవోరా, హోలీ చరణ్ నార్జరీలపై ఎల్లోకార్డు వేటు పడింది.
ఈ దశలో గోవా కోచ్ జికో.. మందార్ రావు దేశాయ్‌కు తోడుగా ఫుల్గాంకో కార్డోజో డిఫెన్సివ్ వ్యూహానికి మెరుగులు దిద్డాడు. నార్త్ ఈస్ట్ జట్టు కోఫి క్రిస్టియాన్ నోర్డీని సబ్ స్ట్యూట్ గా తీసుకున్నా కట్టిమణి అతడ్నీ కట్టడి చేశాడు. చివరి క్షణాల్లో నార్త్ఈస్ట్ దూకుడును అదే స్థాయిలో గోవా గట్టిగానే ఎదుర్కొంది. ప్రారంభంలో నార్త్ఈస్ట్ కు శుభారంభాన్నిచ్చిన మ్యాచ్.. చివరిలో ఇన్ జ్యూరీ సమయం కలిసి రావడం, రాబిన్ సాయంతో రోమియో ఫెర్నాండెజ్ బంతిని గోల్ పోస్ట్ దారి పట్టించడంతో అసాధారణ రీతిలో గోవా గెలుపునకు దారి తీసింది.