పుణె: ఐఎస్‌ఎల్ 3 సీజన్‌లో మహారాష్ట్రకే చెందిన రెండు క్లబ్ జట్ల మధ్య మూడో లీగ్ మ్యాచ్ సోమవారం పుణె నగరంలో జరుగనున్నది. అయితే ఎఫ్‌సి పుణె సిటీ జట్టు ఈ లీగ్ మ్యాచ్‌లో ఇంద్రజాలికుడిగా పేరొందిన కోచ్ ఆంటోనియో హబాస్ లేకుండానే తన పొరుగు నగర క్లబ్ ముంబై సిటీ ఎఫ్‌సి జట్టుతో తలపడుతున్నది.
గత ఏడాది ఐఎస్‌ఎల్ రెండో సీజన్ రెండో సెమీ ఫైనల్‌లో చెన్నైయిన్‌పై జరిగిన మ్యాచ్ సందర్భంగా రిఫరీతో ఘర్షణ కారణంగా హబాస్‌పై అఖిలభారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) క్రమశిక్షణా సంఘం నాలుగు మ్యాచ్‌ల వరకు మైదానంలో అడుగు పెట్టరాదని నిషేధం విధించింది.
గత ఏడాది మ్యాచ్ అట్లెంటికో డీ కోల్‌కతా గెలుపొందిన ఈ మ్యాచ్‌తోనే పుణె సిటీ ప్రయాణం ముగిసింది. దీంతో ఈ సీజన్‌లో తొలి నాలుగు లీగ్ మ్యాచ్‌లకు ఆంటోనియో హబాస్ జట్టుకు దూరం కానున్నాడు. స్పానిష్ కోచ్ హబాస్ గైర్హాజరీలో అధైర్యంగా బరిలోకి దిగుతున్న పుణె కుర్రాళ్లకు అసిస్టెంట్ కోచ్ మిగౌల్ మార్గదర్శనం చేస్తున్నారు. దీనికి తోడు సీనియర్ ప్లేయర్లు ఉండటం కలిసి వచ్చే అంశం.

బార్సిలోనా - చెల్సియా ఎఫ్‌సి మాజీ మిడ్ ఫీల్డర్ ఐడూర్ గుడ్‌జాన్ససెన్ సైతం గాయం కారణంగా ఈ సీజన్ టోర్నీ నుంచే పూర్తిగా వైదొలిగాడు. దీంతో పుణె సిటీ ఫ్రాంచైసీ యాజమాన్యం శరవేగంగా స్పందించి గుడ్‌జాన్ససెస్ స్థానంలో మాజీ లివర్‌పూల్ - జువెంటస్ మిడ్ ఫీల్డర్ మహ్మద్ సిస్సోకోను నియమించుకున్నది. సోమవారం సాయంత్రం ముంబై సిటీ ఎఫ్‌సి క్లబ్‌తో జరిగే మ్యాచ్‌లో జట్టుకు సిస్సోకో సారధ్యం వహించనున్నాడు.
హబాస్, గుడ్‌జాన్ససెన్ లేకపోయినా పుణె సిటీ ఆందోళన చెందాల్సిన పరిస్థితేమీ లేదు. హబాస్ మొత్తం జట్టును అనుభవజ్ఞులైన క్రీడాకారులతో నింపేయడమే దీనికి కారణం. భారత్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఆడే సామర్థ్యం గల వారే. రెండు వేర్వేరు జట్లతో జరిగిన మ్యాచ్‌లలో టైటిళ్లను గెలుచుకున్న సామర్థ్యంగల గోల్‌కీపర్ ఎడెల్ బెటె, మాజీ ఎఫ్‌సి గోవా ఆటగాడు జొనాథన్ లుక్కా, ఢిల్లీ డైనమోస్ ప్లస్ నార్త్‌ఈస్ట్ యునైటెడ్ జట్లలో ఇంతకుముందు ఆడిన బ్రూనో ఏరియాస్ వంటి కీలక ఆటగాళ్లతో పుణె సిటీ. తన ప్రత్యర్థులతో తల పడేందుకు సంసిద్ధంగా ఉన్నది.
దేశీయ ఆటగాళ్లలో గత ఏడాది అట్లెంటికో డీ కోల్‌కతా జట్టుపై స్ఫూర్తిదాయక ఆటతీరు ప్రదర్శించిన డిఫెండర్ అగస్టీన్ ఫెర్నాండెజ్, స్ట్రైకర్ ఇజుమి అరాటా వంటి వారు, అనుభవజ్ఞులైన క్యాంపెయినర్లు ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్, నారాయణ్ దాస్, సంజూ ప్రధాన్ మరో సారి తమ సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు.
కనీసం పేపర్ పైనైనా ముంబై సిటీ ఎఫ్‌సి తన ప్రత్యర్థి జట్లతో తలపడే స్థాయిలో కనిపించడం లేదు. వరుసగా రెండు ఐఎస్‌ఎల్ ఎడిషన్లలోనూ ముంబై సిటీ సామర్థ్యం ఉన్న జట్లను రంగంలోకి దించినా ఇప్పటికీ చెప్పుకోదగిన ఫలితాలేమీ రాబట్టలేదు. రెండు సీజన్లలోనూ ఏడవ, ఆరవ స్థానంతో సరిపెట్టుకున్నది.
ముంబై సిటీ జట్టుకు రెండు ప్రపంచ కప్ టోర్నమెంట్లలో కోస్టారికాకు విజయవంతంగా గైడ్‌గా వ్యవహరించిన అలెగ్జాండ్రె గౌమారేస్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులపై విజయ సాధనకు అవసరమైన వ్యూహాల రచనలో లోపంగానీ, ఆందోళన చెందాల్సిన అవసరం గానీ లేదు. కోచ్ నుంచి చిన్న చిన్న ఆప్షన్లతో భారత ఫుట్‌బాల్ జట్టు సారధి సునీల్ ఛెత్రి సహా నలుగురు బెంగళూర్ ఎఫ్‌సి ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం ముంబై సిటీకి వెలితే.
ఇక కొత్తగా ముంబై మార్క్యూ ప్లేయర్ (సారధి)గా బాధ్యతలు స్వీకరించిన డియాగో ఫొర్లాన్‌పైనే అందరి దృష్టి పడింది. 2010 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో సంయుక్త టాప్ స్కోరర్‌గా నిలిచి పేరు తెచ్చుకున్న ఈ ఉరుగ్వేయన్ ప్లేయర్.. ఈ దఫా ఐఎస్‌ఎల్ సీజన్‌లో ముంబై సిటీ జట్టు విజయ బాధ్యతలను తన భుజస్కందాలపై మోస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్దమయ్యాడు. ఆయనతోపాటు గత సీజన్‌లో పుణె తరపున ఆడిన జాకిచందర్‌సింగ్ ఈ దఫా ముంబై సిటీకి ప్రాతినిధ్యం వహిస్తుండటం ఆసక్తికర పరిణామం.