న్యూఢిల్లీ: ఐఎస్‌ఎల్ 3 ఎడిషన్‌లో నూతనోత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఎనిమిది క్లబ్‌ల జట్లతో సాగుతున్న ఈ టోర్నీలో గతేడాది ప్రధాన పోటీదారులు చెన్నైయిన్ ఎఫ్‌సి, గోవా ఎఫ్‌సి సిటీ జట్లు పాయింట్ల వేటలో వెనుకబడే ఉన్నాయి.
గత రెండు సీజన్లలో సెమీస్ వైపు దృష్టే సారించని జట్లు - ముంబై సిటీ ఎఫ్‌సి, ఎఫ్‌సి పుణె సిటీ, నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి జట్లు తొలినుంచే దూకుడుగా ఆడుతూ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయా? అన్న వాతావరణం సృష్టించాయి.
దేశీయ ఆటగాళ్లతో చెన్నైయిన్ ప్రయోగం
డిసెంబర్ మూడో వారానికి ముగిసే ఈ టోర్నీ ప్రారంభంలోనే ఏ జట్టు సెమీస్ వరకూ వస్తుందని జోస్యం చెప్పడం తొందరపాటే అవుతుంది. కానీ మ్యాచ్‌ల ట్రెండ్ మాత్రం ఆలోచింపజేస్తున్నది. ఇతర జట్లతో పోలిస్తే 11 పెనాల్టీలను తమకు అనుకూలంగా మార్చుకున్న నేపథ్యం చెన్నైయిన్‌ది.

అందునా తొలి భారత్ సాకర్ (ఐఎస్‌ఎల్ తొలి ఎడిషన్)లో చెన్నైయిన్‌కు ప్రాతినిధ్యం వహించిన బల్వంత్‌సింగ్ టోర్నీలోనే అత్యధిక పాయింట్లు స్కోర్ చేసిన రికార్డు సాధించాడు. మలి ఎడిషన్‌లో జెజె లాల్పెఖౌలా ఆ పాత్ర పోషించాడు. ఈ ఏడాది కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 66వ నిమిషంలో గోల్‌చేసిన జయేశ్ రాణె జట్టు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ముంబై, పుణె రూటే సెపరేటు
ముంబై సిటీ, పుణె సిటీ జట్లు ఈ ఏడాది పూర్తిగా భిన్నమైన దృక్పథాలతో టోర్నీలో ముందుకు వచ్చాయి. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే ముంబైని ఏ జట్టు ఢీకొట్టలేదు. ముంబై చేతిలో పుణె, ఫాటోర్డాలో గోవాపై పుణె విజయంతో సమానమైన పాయింట్లు సాధించాయి. గత రెండు సీజన్లతో పోలిస్తే ఇది భిన్నమైన నేపథ్యం
వెలుగుతున్న స్టార్లు
ముంబై సిటీ, నార్త్‌ఈస్ట్‌లకు ప్రధాన కోచ్‌లుగా వ్యవహరిస్తున్న అలెగ్జాండ్రె, నెలో వింగాడ ఏ చిన్న అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకొనేలా తమ టీమ్‌లను తీర్చిదిద్దారు. ఈ రెండు జట్లు సంప్రదాయంగా నెమ్మదిగా సాగుతాయన్న అభిప్రాయం నెలకొంది.
కానీ వారికి అవకాశం వచ్చినప్పుడు మాత్రం రెండు జట్లు చెలరేగిపోతాయంటే అతిశేయోక్తి కాదు. ఈ ఎడిషన్‌లో ప్రారంభ మ్యాచ్‌ల్లో విజయంతో శుభారంభాన్ని అందుకున్నాయి. మూడు దఫాలుగా సాగిన ఐఎస్‌ఎల్ టోర్నీలో ఎఫ్‌సి గోవాపై నార్త్‌ఈస్ట్ తొలి విజయం నమోదుచేయగా, పుణెపై గోవా గెలపొందింది.
ధృడమైంది 'లా లీగా'
'లా లీగా' ఫుట్‌బాల్ లీగ్ టోర్నీ ప్రపంచంలోకెల్లా శక్తిమంతమైందని స్పోర్టింగ్ జిజోన్ స్ట్రైకర్ దుజే కోప్ అన్నాడు. స్పానిష్ చాంపియన్‌షిప్ కోసం సాగుతున్న పోరులో బార్సిలోనా క్లబ్‌పై ఇటీవల అలావేస్ విజయం సాధించిన నేపథ్యంలో దుజే కోవ్ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకున్నది.
ప్రస్తుతం టోర్నీలో అట్లెటికో మాడ్రిడ్ లీడ్‌లో ఉండగా, అలవేస్, కెల్టా విగో జట్లతో ఓటమి పాలైన డిఫెండింగ్ చాంపియన్ బార్సిలోనా క్లబ్ నాలుగో స్థానంతో సంతృప్తి పడింది. బార్సిలోనాకు ప్రధాన ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ వరుసగా మూడు మ్యాచ్‌లు డ్రాచేసుకుని స్పోర్టింగ్ జిజోన్‌తో తలపడుతున్నది.
ఈ నేపథ్యంలో అలావేస్‌తో ఒప్పందం చేసుకున్న దుజే కోవ్ మాట్లాడుతూ 'ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన ఫుట్‌బాల్ లీగ్ టోర్నీ లా లీగా' అని అన్నాడు. ఈ టోర్నీలో ఏ మ్యాచ్‌ను తేలిగ్గా గెలవలేమని, ప్రతి మ్యాచ్ ఫలితం బహిరంగమేనని, ఫుట్‌బాల్ ఆట ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయన్నాడు.