న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో ఫుట్‌బాల్ ప్రోత్సాహానికి మరో ముందడుగు పడింది. ఈ బాధ్యతను మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫ్రాంచైసీ జట్టు యాజమాన్యం ఢిల్లీ డైనమోస్ తన భుజస్కంధాలపైకి ఎత్తుకోనున్నది. ఈ ఆట ఆడేందుకు యువతను ఆకర్షించేందుకు అక్టోబర్ రెండో తేదీ నుంచి 'యూత్‌లీగ్' ప్రారంభిస్తున్నట్లు ఢిల్లీ డైనమోస్ ప్రకటించింది.
దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలోని అతిపెద్ద, పాత లీగ్ టోర్నీలన్నీ ఇక ఢిల్లీ డైనమోస్ యూత్ లీగ్ బ్యానర్ కింద ఐదో ఎడిషన్ టోర్నమెంట్ నిర్వహించుకోనున్నాయి. న్యూఢిల్లీ నగరంలోని ప్రధాన ఫుట్‌బాల్ అకాడమీలు, పాఠశాలలకు చెందిన 70 జట్లు.. ఈ యూత్ లీగ్‌లో పాలుపంచుకోనున్నాయి. చిన్నారుల నుంచి యువత వరకు వయస్సు ప్రాతిపదికన ఏడు టీమ్‌లు ఈ లీగ్‌లో భాగస్వామి కానున్నాయి.
యూత్ లీగ్ ఏర్పాటుపై ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సి అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ తమ ఫ్రాంచైసీ భాగస్వామ్యంతో ఢిల్లీ డైనమోస్ యూత్‌లీగ్.. దేశ రాజధానిలో తొలి యుత్‌లీగ్ నిర్వహించనున్నదని తెలిపారు.

ఉత్తర భారతంలో మారుమూల గ్రామాల వరకు ఫుట్‌బాల్ ఆటను సుస్థిరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యమే తమ యూత్ లీగ్ ప్రారంభానికి కారణమని అగర్వాల్ చెప్పారు. ఏ క్రీడకైనా యువతే పునాది అని, యువ జట్లతో కూడిన క్లబ్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. తాము ప్రారంభించే యూత్ లీగ్ .. యువ క్రీడాకారులను వెతికి పట్టుకుని వారిలో ప్రతిభను అభివృద్ధి చేసేందుకు గొప్ప ఫ్లాట్‌ఫామ్ అవుతుందని ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.