న్యూఢిల్లీ: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో మలి విజయం కోసం ఢిల్లీ డైనమోస్ తహతహలాడుతోంది. సొంత గడ్డపై మంగళవారం ముంబై సిటీ ఎఫ్ సి జట్టుతో జరిగే మ్యాచ్‌లో గెలుపొందేందుకు అన్ని అస్త్ర శస్త్రాలను సిద్ధంచేసుకున్న ఢిల్లీ కుర్రాళ్లు.. పట్టు బిగించేందుకు రెడీ అయ్యారు.
ప్రస్తుత సీజన్ లో ఓటమి ఎరుగని రెండు జట్లలో ఒకటిగా ఉన్న ఢిల్లీ డైనమోస్ ఒక విజయం, రెండు మ్యాచ్ లను డ్రాగా ముగించి ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ ల్లో పాల్గొన్నదాని ప్రత్యర్థి ముంబై సిటీ ఎఫ్ సి రెండు విజయాలు, ఒక మ్యాచ్ డ్రాతో పాయింట్ల పట్టికలో ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి.. టైటిల్ కోసం బరిలో ఉన్నానని ప్రకటించింది.
అయితే గత మ్యాచ్ లో కేరళ బ్లాక్ బస్టర్స్ తో 0 - 1 స్కోర్ తేడాతో ఓటమి పాలు కావడంతో ఒకింత నైతిక స్థైర్యం దెబ్బతిన్నా.. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం రగిలిపోతున్నది. గత రెండు ఎడిషన్లలో ముంబై, ఢిల్లీ డైనమోస్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక మ్యాచ్ గెలుచుకున్న జంబ్రొట్టా జట్టు రెండుసార్లు ఓటమి పాలైంది.
ఈ ఎడిషన్ లో తొలి మ్యాచ్ లోనే ఢిల్లీ డైనమోస్.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్ సిపై 3 - 1 స్కోర్ తేడాతో స్ఫూర్తిదాయక విజయం సాధించింది. కేరళ, నార్త్ ఈస్ట్ జట్లతో జరిగిన మ్యాచ్ లను డ్రాగా ముగించింది. డైనమోస్ వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ జియాంలుకా జంబ్రొట్టా.. తన కుర్రాళ్లు వచ్చిన అవకాశాలను మిస్ చేరని ఆశాభావం వ్యక్తంచేశాడు.

నార్త్ఈస్ట్ తో జరిగిన మ్యాచ్ లో స్కోరింగ్ కోసం మంచి చాన్స్ లు కల్పించిన రిచర్డ్ గాడ్జె వాటిని గోల్స్ గా మార్చడంలో విఫలమయ్యాడు. ఇక చెన్నైయిన్ తో జరిగిన మ్యాచ్ తోనే స్టార్ ఆటగాడిగా వెలుగు వెలిగిన మార్సెలిన్హో.. ఉత్తమ ఫలితాల సాధనకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గత ఎడిషన్ లో ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌడా రెండుసార్లు మ్యాచ్ లో కనిపించినా జట్టును ప్రభావితం చేయలేకపోయాడు.
ఢిల్లీ మిడ్ ఫీల్డింగ్ విభాగం నార్త్ ఈస్ట్ పై అటాకింగ్ చేయడంలో విఫలమైంది. డిఫెన్సివ్ ఆటలోనే ఢిల్లీ కుర్రాళ్లు మెరుగు పడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ముంబై సిటీ ఎఫ్ సి జట్టు సారధి డియాగో ఫోర్లాన్ వరుసగా మూడో గేమ్ కు దూరం కానున్నాడు. అయితే ముంబై మిడ్ ఫీల్డర్ ప్రొనాయ్ హాల్డర్ ఒక గేమ్ సస్పెన్షన్ తర్వాత మళ్లీ జట్టులోకి రావడం సానుకూల అంశమే.
ఫార్వర్డ్ ప్లేయర్ గా హైతీయన్ సోనీ నోర్డే బరిలోకి దిగే అవకాశముంది. సొంతగడ్డపై 27వేల మందికి పైగా అభిమానుల మధ్య మ్యాచ్ ఆడటమూ ఢిల్లీ బాయ్స్ కు పాజిటివ్ అంశమే. మ్యాచ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో జట్టులో ఇంప్రూవ్ మెంట్ రావాలని జంబ్రొట్టా ఆశిస్తున్నాడు. నార్త్ఈస్ట్ తో జరిగిన మ్యాచ్ లో ఇరువైపులా పలు అవకాశాలు కల్పించుకున్నా.. వాటిని గోల్స్ గా మార్చుకోవడంలో విఫలమయ్యారు.
నార్త్ ఈస్ట్ తో జరిగిన మ్యాచ్ బాగా ఆడామని, కానీ అవకాశాలను తప్పనిసరిగా సొంతంచేసుకునేందుకు సిద్ధం కావాలన్నాడు. గోల్ కీపర్ తో కలిసి అటాకింగ్ చేయడమే తమ ప్రధాన వ్యూహం అని జంబ్రొట్టా వ్యాఖ్యానించాడు. అయితే ఇది తాము ఆడే ప్రత్యర్థిని బట్టి ఆధార పడి ఉంటుందన్నాడు. ఒకవేళ ప్రత్యర్థి జట్టు నుంచి ఒత్తిడి ఎక్కువైతే తమ రూట్ మార్చుకుంటామని తెలిపాడు.
ముంబై జట్టు వివిధ జట్లతో విభిన్న రూపాల్లో మ్యాచ్ లో పాల్గొన సామర్థ్యం కలిగి ఉంది. ఈ వాస్తవాన్ని అంగీకరించిన ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా.. తమ జట్టు గుర్తింపును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు. తాము విభిన్న పరిస్థితుల్లో వ్యూహం మార్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నామని తెలిపాడు.