న్యూఢిల్లీ: ప్రస్తుత సీజన్ లో సొంత గడ్డపై విజయం కోసం ఢిల్లీ డైనమోస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ పై జరిగిన మ్యాచ్ లో 3 - 1 స్కోర్ తేడాతో అదరగొట్టిన ఢిల్లీ కుర్రాళ్లు.. తర్వాత జరిగిన మూడు మ్యాచ్ ల్లో డ్రా, ఒక మ్యాచ్ లో ఓటమి పాలయ్యారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేరళ బ్లాక్ బస్టర్స్‌తోపాటు నార్త్ఈస్ట్, ముంబై సిటీలతో మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. డ్రాగా ముగిసిన వాటిలో నార్త్ఈస్ట్, ముంబై సిటీ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఢిల్లీలో జరిగినవే. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఇరు పక్షాలు చెరో మూడు గోల్స్ తో వీక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతినిచ్చాయే తప్ప ఫలితం తేలలేదు.
కోల్ కతాతో జరిగిన మ్యాచ్.. పెనాల్టీ కార్నర్ కారణంగా ఢిల్లీ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో పుణెతో జరిగే మ్యాచ్‌లోనైనా కుర్రాళ్లు చెలరేగిపోవాలని, తిరిగి ట్రాక్ లోకి రావాలని కోచ్ జంబ్రొట్టా అభ్యర్థించడం అర్థం చేసుకోదగిందే. ఇక పుణె జట్టు గోవాపై ఏకైక విజయం తప్ప, దాని ఖాతాలో అన్నీ ఓటములే.

అట్లిటికో డీ కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో తమ కుర్రాళ్లకు గోల్ చేసే అవకాశాలు వచ్చినా.. మ్యాచ్ ను గెలుచుకునే ప్రయత్నం చేయలేదని ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా తెలిపాడు. తమ ఆటగాళ్లకు పలు అవకాశాలు కల్పించుకోగల సామర్థ్యం ఉందని, అందుటలో ఎటువంటి సమస్యా లేదన్నాడు. కానీ దురద్రుష్టవశాత్తు తమ ప్లేయర్లు కొన్ని పొరపాట్లు చేశారన్నాడు.
ఫుట్ బాల్ వంటి ఆట కొన్నిసార్లు క్రూయల్ గా కనిపిస్తుందని, ఇటువంటి పరిస్థితులను పాజిటివ్‌గా స్వీకరించాలని చెప్పాడు. తమ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారని.. అయితే వారి ఆటతీరు మెరుగు పరుచుకోవాల్సి ఉన్నదని చెప్పాడు. పుణెతో జరిగిన మ్యాచ్ ల్లో ఢిల్లీ ఎంతవరకూ ఓటమికి గురి కాలేదని జంబ్రొట్టా గుర్తుచేశాడు.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగే మ్యాచ్ లో విజయంతో తిరిగి శుభారంభాన్ని అందుకోవాలని ఢిల్లీ... పరాజయాల బారీ నుంచి బయట పడాలని గోవా పట్టుదలగా ఉన్నాయి. ఇక మ్యాచ్‌ల్లో రిఫరీల తీర్పులపై పుణె కోచ్ అంటోనియో హబాస్ అనుమానాలు వ్యక్తంచేశాడు.
దూకుడుగా వెళుతున్న ఆటగాళ్లను రిఫరీలు నిలువరించేందుకు సరైన పద్ధతిలో ముందుకు వెళ్లాలని సూచించాడు. జట్టు సారధి, ప్లేయర్లు అంతా పాతవారేనని.. ఇదే తరహాలో ఆటతీరు కొనసాగడం టీమ్ కు అంత మంచిది కాదని కుర్రాళ్లు తమ ఆటతీరు ఇకనైనా మార్చుకోవాలని హితవు పలికాడు.
పాయింట్ల పట్టికలో ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్న పుణె కుర్రాళ్లు.. గోల్స్ చేయడంలో విఫలమవుతున్నారని హబాస్ అంగీకరించాడు. తమ జట్టులో 95 శాతం ఆటగాళ్లు కొత్తవారేనని, వారు అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నారని తెలిపాడు.
అతి తక్కువ గడువుతో సాగుతున్న టోర్నీలో సమయానుకూలంగా సెటిల్ కావాల్సిన అవసరం ఉన్నదన్నాడు. తమ కుర్రాళ్లు పుంజుకుని అవకాశాలు స్రుష్టించి గోల్స్ చేస్తేనే ముందుకెళ్లగలమన్నాడు. ఐఎస్ఎల్ తొలి ఎడిషన్‌లో కోల్ కతాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన హబాస్.. గతేడాది ఐఎస్ఎల్ క్రమశిక్షణా సంఘం నిర్ణయం మేరకు ఈ ఏడాది తొలి నాలుగు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు.
పుణె మిడ్ ఫీల్డర్ జొన్నాథన్ లుక్కా మాట్లాడుతూ ఢిల్లీ కుర్రాళ్లే ఫేవరెట్ అని పేర్కొన్నాడు. అయితే ఫుణె సిటీ కూడా చాలా మంచిగా ఆడుతుందని, కానీ సొంతగడ్డపై ఆడుతున్న ఢిల్లీ మాత్రమే గెలుపొందే అవకాశాలు లేకపోలేదన్నాడు.
ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ను పుణె 1 - 1 స్కోర్ తో కట్టడి చేయగా, కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 1 - 0 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది. ఇరు జట్లు వేర్వేరు కారణాల రీత్యా ఆసక్తికర ఫలితం కోసం వేచిచూస్తున్నాయి. పుణె, ఢిల్లీ మధ్య ఇంతకుముందు జరిగిన మ్యాచ్ లలో ఢిల్లీ మూడింట విజయం సాధించగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది.
తొలిసారి 2014లో జరిగిన తొలి మ్యాచ్ గోల్స్ చేయకుండానే డ్రాగా ముగిస్తే, తర్వాత మ్యాచ్ ల్లో ఢిల్లీ 1 - 0, 2 - 1, 3 - 1 స్కోర్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ ప్లేయర్ రిచర్డ్ గాడ్జె ఇంతకుముందు ముంబై సిటీతోజరిగిన మ్యాచ్ 3 - 3 డ్రాగా ముగిసినా 'హీరో ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు.
ఈ మూడు గోల్స్ కూడా రిచర్డ్ గాడ్జే ఆధ్వర్యంలో చేసినవే. ఒక గోల్ నేరుగా, మరో గోల్ చేయడంలో సహకారం, పెనాల్టీ కార్నర్‌ను అనువుగా మార్చుకుని మూడో గోల్ సాధించాడు. గాడ్జె పెర్పార్మెన్స్ ఇరు జట్లలోనూ విభిన్నంగా ఉంటుంది. పుణెలో పాసింగ్ క్రీడాకారుడిగా ధర్మరాజ్ రావణన్ పేరు.
నిశ్శబ్ధంగా ఉంటూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తేగల సమర్థుడు ఆయన కావడంతో జట్టులో రావణన్ స్థానం పదిలం. మంచి డిస్ట్రిబ్యూటర్ గానూ ఆయనకు పేరుంది. మ్యాచ్ సమయంలో గాల్లోకి ఎగురుతూ ప్రత్యర్థులపై అటాకింగ్‌తో ఢిల్లీ లయన్స్ ను సమర్థవంతంగా నిలువరించగల సత్తా కల వాడు.
క్రితంసారి కోల్ కతా తరుఫున ఆడిన ఈ యువ మణిపురి కుర్రాడు మిలాన్ సింగ్.. ఢిల్లీ తరుఫున ప్రతి మ్యాచ్ లోనూ విజయవంతంగా దూసుకెళ్తున్నాడు. ఢిల్లీ లయన్స్‌కు రిలయబుల్ ప్లేయర్‌గా సెంటర్‌లో ప్రత్యర్థులకు వణకు పుట్టించగలడు. గుడ్ పాసింగ్ సామర్థ్యంతోపాటు దూరం నుంచే షాట్లు కొట్టడం, ప్రత్యర్థిని అనునిత్యం డిఫెన్స్‌తో నియంత్రించడం మిలాన్ సింగ్ కు వెన్నతోపెట్టిన విద్య.
పుణెతో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాదించి మూడు పాయింట్ల సాదనలో ఇతడి పాత్ర కీలకమేనని భావిస్తున్నారు. ఇక పుణెలో కీలకమైన ఆటగాడు ఆరాటా ఇజుమి తమ హెడ్ కోచ్ అంటోనియో హబాస్ ఆదేశాలకు అనుగుణంగా మ్యాచ్ లో పాల్గొంటాడు. ఈ ఏడాది ఒకే ఒక గోల్ మాత్రమే చేసిన ఇజుమి.. ఇతర సహచరులకు చేయూతనివ్వడం, అవకాశాల అభివ్రుద్దికి పాటుపడతాడు. ఢిల్లీ డిఫెన్స్ ను అధిగమించి పుణెకు ఒక ఫోర్స్‌గా నిలుస్తాడని అంతా భావిస్తున్నారు.
మిజోరం కుర్రాడు లాల్చావంకిమా ఈ ఏడాది ఢిల్లీ తరుపున జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. హెల్తీ పాసింగ్, బంతిపై నియంత్రణ కొనసాగించడంలో ఆయనకు ఆయనే సాటి. పెర్ఫార్మెన్స్ గల ఆటగాడిగా ఢిల్లీ డైనమోస్‌కు సమగ్రమైన సభ్యుడిగా పుణెతో జరిగే మ్యాచ్‌లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.
ఇక పుణె తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న జీసస్ రోడ్రిగ్యుస్ టాటో ప్రస్తుత సీజన్‌లోనైతే ఖాతా తెరవలేదు. కానీ షాట్లు కొట్టడంలోగానీ, బంతిని పాస్ చేయడంలో గానీ దిట్ట. మ్యాచ్ గెలువాలని గట్టి సంకల్పంతో ఆడితే ఆయన పాత్ర కీలకమే సుమా.