
హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ పుట్‌బాలర్ డేవిడ్ బెకహాం తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ పిక్ నెటిజన్లు అతడిని ఓ ఆట ఆడుకునేలా చేసింది. డేవిడ్ బెకహాం తన ఏడేళ్ల కూతురు హార్పర్‌కు లిప్ కిస్ ఇచ్చాడు. ఆ ఫోటోను తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.
"క్రిస్‌మస్ రాబోతున్నది కదా.. ఈ సందర్భంగా స్కేటింగ్ చేద్దామా" అంటూ ఆయన క్యాప్సన్ కూడా పెట్టాడు. ఈ ఫోటోని బెకహాం పోస్టు చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. సోషల్ మీడియాలో దీనిని తెగ ట్రోల్ చేస్తున్నారు. "డేవిడ్.. ఆమె నీ కూతురు, ఆమె లిప్స్ మీద ఎందుకు కిస్ చేస్తున్నావు.. అలా నీ భార్యకు ఇవ్వు" అని ఓ కామెంట్ పెట్టాడు.
"నేనయితే పెదాల కంటే బుగ్గల మీద ముద్దిస్తే బెటర్ అనుకుంటున్నా" అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ విషయంలో డేవిడ్ బెకహాం అభిమానులు, స్నేహితులు మాత్రం అతడికి మద్దతుగా నిలిచారు. "నా వయసు 35. నేను ఇప్పటికీ నా డాడీకి లిప్ కిస్ ఇస్తా.. దీంట్లో తప్పేముంది" అని ఓ లేడీ అభిమాని కామెంట్ చేసింది.
"ఆ ఫోటోలో ప్రేమను చూడండి.. అది తండ్రీకూతుళ్ల బంధం" అంటూ మరొక అబిమాని కామెంట్ పెట్టాడు. ఇక, డేవిడ్ బెకహాం విషయానికి వస్తే ప్రపంచంలోని సాకర్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఆగస్టు 2018లో యూఈఎఫ్‌ఏ ప్రెసిడెంట్ అవార్డుని డేవిడ్ బెకహాం గెలుచుకున్నాడు.
ఫుట్‌బాల్‌లో బెకహాం సాధించిన విజయాలకు ప్రతీకగా ఆయనకు ఈ అవార్డును అందజేశారు. 1999లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత బెకహాం లాస్ ఏంజెల్స్ గెలాక్సీ, ఏసీ మిలన్, పారిస్ సెయింట్ జెర్మన్ తదితర జట్లకు ఆడాడు. 2013లో పుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు.