

హైదరాబాద్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానొ రొనాల్డో క్లబ్ సాకర్‌లో చరిత్ర సృష్టిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన రొనాల్డో రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ నుంచి ఇటలీకి చెందిన జువెంటస్ క్లబ్ చేరిన సంగతి తెలిసిందే. తాజాగా జువెంటస్ తరుపున రెండు గోల్స్ కొట్టి రికార్డ్‌ల మోత మోగించాడు.
జువెంటన్ క్లబ్ తరఫున సిరి-ఏ లీగ్‌లో తొలిసారిగా స్కోర్ చేసి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. సాస్సువోలో క్లబ్‌పై రెండు గోల్స్ కొట్టి జువెంటస్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ రెండు గోల్స్‌తో క్లబ్ సాకర్‌లో రొనాల్డో నమోదు చేసిన గోల్స్ సంఖ్య 400 దాటింది.
ఇప్పటివరకూ నాలుగు వేరువేరు దేశాల లీగ్‌ల్లో నాలుగు క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించిన రొనాల్డో రికార్డు స్థాయిలో గోల్స్ నమోదు చేశాడు. తొలి సారి ప్రాతినిధ్యం వహించిన స్పోర్టింగ్ క్లబ్ తరఫున 3 గోల్స్, మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరఫున 84 గోల్స్, రియల్ మ్యాడ్రిడ్ తరుపున 311 గోల్స్, జువెంటస్ తరుపున 2 గోల్స్ నమోదు చేశాడు.
జువెంటస్ క్లబ్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో సాస్సువోలో క్లబ్‌పైనే ఈ రెండు గోల్స్ నమోదు చేయడం విశేషం. ఇప్పటికే పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తరఫున ఆల్ టైమ్ టాప్ స్కోరర్‌గా క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. పోర్చుగల్ తరఫున 68 గోల్స్ సాధించాడు.
క్లబ్‌ల వారీగా క్రిస్టియానో రొనాల్డో నమోదు చేసిన గోల్స్:
* స్పోర్టింగ్ క్లబ్ (పోర్చుగల్) - 3 గోల్స్
* మాంచెస్టర్ యునైటెడ్ (ఇంగ్లండ్) -84 గోల్స్
* రియల్ మ్యాడ్రిడ్ (స్పెయిన్)-311 గోల్స్
* జువెంటస్ (ఇటలీ)- 2 గోల్స్