ఫిఫా ప్రపంచ కప్ వేళ రొనాల్డో సంచలన నిర్ణయం!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగంలో ఓ అద్భుతమైన శకానికి ముగింపు పలికే సమయం మరింత దగ్గరైంది. మైదానంలో అడుగుపెడితే రికార్డుల వేట సాగించే పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. రాబోయే 2026 ఫిఫా వరల్డ్ కప్ తన కెరీర్‌లో చివరి టోర్నమెంట్ కానుందని రొనాల్డో ప్రకటించడం గమనార్హం. పోర్చుగల్ జట్టు కీలకమైన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక వివరాలను వెల్లడించాడు.
చాలా కాలంగా రొనాల్డో రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు, ఊహాగానాలకు ఈ తాజా ప్రకటనతో పూర్తి స్థాయిలో తెరపడింది. ఇప్పటికే బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్‌మార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకగా.. ఇప్పుడు రొనాల్డో కూడా చివరి టోర్నీ ఆడబోతున్నట్లు ప్రకటించడంతో క్రీడా ప్రేమికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తన అంతర్జాతీయ ముగింపు ప్రస్థానాన్ని సగర్వంగా ప్రకటిస్తూనే, రాబోయే మ్యాచ్‌లలో ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని నిశ్చయించుకున్నట్లు ఈ ఫిఫా దిగ్గజం వెల్లడించాడు.

ఫుట్‌బాల్‌పై నా ప్రేమ అపారం: క్రిస్టియానో రొనాల్డో
తాను కేవలం ఫుట్‌బాల్ క్రీడపై ఉన్న అమితమైన ప్రేమతోనే మైదానంలో చెమటోడుస్తున్నానని క్రిస్టియానో రొనాల్డో పేర్కొన్నాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "స్పెయిన్‌తో జరగబోయే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం వచ్చినా, నేను పూర్తి సంతోషంతో మైదానాన్ని వీడుతాను. ఈ అద్భుతమైన క్రీడ కోసం నేను నా శాయశక్తులా శ్రమించాను. వంద శాతం కాదు, ఏకంగా వెయ్యి శాతం సహకారం అందించాను. అందుకే నా కెరీర్ గురించి నాకు ఎలాంటి బాధ లేదు" అని రొనాల్డో చెప్పుకొచ్చాడు.
తన జీవితంలో భౌతిక సుఖలా కంటే ఆటపై ఉన్న అభిరుచి, దేశానికి ప్రాతినిధ్యం వహించడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయాలు అని క్రిస్టియానో రొనాల్డో గుర్తు చేశాడు. ఓ క్రీడాకారుడిగా విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ.. తనలో ఇంకా కసి తగ్గలేదన్నాడు. చివరి వరల్డ్ కప్ కావడంతో ప్రతి మ్యాచ్‌ను ఆడుతూ, సరికొత్త జ్ఞాపకాలను మూటగట్టుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నాడు. మైదానంలో తన చివరి క్షణం వరకు బెస్ట్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు.
రికార్డుల వీరుడిగా పోర్చుగల్ ప్రయాణం
పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున 2003లో క్రిస్టియానో రొనాల్డో తన అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. నాటి నుంచి నేటి వరకు తిరుగులేని ఆటగాడిగా ఎదుగుతూ జట్టును ముందంజలో నిలిపాడు. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ సాధించిన అరుదైన ఘనతను కూడా రొనాల్డో పదిలపరుచుకున్నాడు. ఇప్పటివరకు మొత్తం 232 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఈ సూపర్ స్టార్ ఏకంగా 146 గోల్స్ సాధించి అంతర్జాతీయ విభాగంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
రెండు దశాబ్ధాలకు పైగా సాగిన తన సుదీర్ఘమైన క్రీడా కెరీర్లో ఎదురైన ప్రతి ఒడిదొడుకులను క్రిస్టియానో రొనాల్డో ధీటుగా తట్టుకుని నిలబడ్డాడు. తన అద్భుతమైన ప్రయాణానికి భగవంతుడే కారణమని ఆయన ఎంతో వినమ్రంగా తెలిపాడు. తాను ఈ ప్రపంచకప్ సాధించినా సాధించకపోయినా, తన ప్రయాణం పట్ల పూర్తి గర్వంతో ఉన్నానని, దేవుడు తనకు ఎనలేని శైలిని, అవకాశాలను ప్రసాదించాడని ఆనందం వ్యక్తం చేశాడు. శ్రేయోభిలాషులు, అభిమానులు అందించిన ప్రాత్సాహాన్ని ఎప్పటికీ మరువలేనని క్రిస్టియానో రొనాల్డో పేర్కొన్నాడు.
క్రమశిక్షణ, తిరుగులేని ఫిట్‌నెస్ సాధనతో దశాబ్దాల పాటు ప్రపంచ ఫుట్‌బాల్ మైదానాన్ని శాసించిన రొనాల్డో.. 2026 వరల్డ్ కప్ చివరిదని ప్రకటించడం ఆట చరిత్రలో ఓ మహోజ్వల ఘట్టం కానుంది. ఈ మెగా టోర్నీలో రొనాల్డో తన జట్టును ప్రపంచ విజేతగా నిలుపుతాడా లేదా అనేది పక్కన పెడితే, అతడు సృష్టించిన సువర్ణ రికార్డులు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవనున్నాయి. రొనాల్డో నిష్క్రమణతో సాకర్ ప్రపంచం ఒక గొప్ప ఛాంపియన్‌ను కోల్పోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications