ఖాట్మాండ్: పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిష్టియానో రొనాల్డో తన ఉదారతను చాటుకున్నారు. నేపాల్ భాకంపం నేపథ్యంలో భూకంప బాధితులకు రూ.50 కోట్ల విరాళం ప్రకటించారు. నేపాల్లో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సేవ్ ది చిల్డ్రన్ అనే చారిటీ సంస్థకు అతను ఈ విరాళం అందచేసినట్లు ఫ్రాన్స్ నుండి వలువెడే క్రీడా మేగజైన్ తెలిపింది.
నేపాల్ భూకంప బాధితులకు తమకు తోచినంత విరాళం అందించాలని తమ అభిమానులకు 30 ఏళ్ల రొనాల్డో గత నెలలో సామాజిక అనుసంధాన వేదికలు అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం అందించడం రొనాల్డో గతంలోను పలుమార్లు చేశారు. గత ఏడాది పది నెలల చిన్నారికి మెదడుకు శస్త్ర్ర చికిత్క చేయించేందుకు రూ.59 లక్షలు ఇచ్చారు.

నేపాల్లో మళ్లీ భూప్రకంపనలు
నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఆదివారం ఉదయం మళ్లీ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలు పైన భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. ఖాట్మాండుకి వంద కిలోమీటర్ల దూరంలోని సింధుపాల్ చౌక్ జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. గత నెల ఏప్రిల్ 25 భూకంపం వచ్చాక నేపాల్లో ఇప్పటి వరకు భూమి 156సార్లు కంపించింది.