
హైదరాబాద్: పోర్చుగల్ జట్టు కెప్టెన్, జువెంటస్ క్లబ్ (ఇటలీ) స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయి దాటాడు. ఫుట్‌బాల్ చరిత్రలో (జాతీయ జట్టు, క్లబ్‌ల తరఫున) అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇటలీ ప్రొఫెషనల్ లీగ్ సెరియె 'ఎ'లో భాగంగా ట్యూరిన్‌లో ఆదివారం ఉడినిస్ కాల్సియో క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టిన రొనాల్డో.. కెరీర్‌లో మొత్తం 758 గోల్స్ తన పేరిట లికించుకున్నాడు. ఈ క్రమంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే (757)ను అధిగమించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు 756 గోల్స్‌తో మూడో స్థానంలో ఉన్న రొనాల్డో.. రెండు గోల్స్ చేసి పీలేను దాటి ముందుకెళ్లాడు. రొనాల్డో ప్రొఫెషనల్ లీగ్స్‌లో 656 గోల్స్, దేశం తరఫున ఆడుతూ 102 గోల్స్ చేశాడు. అధికారిక లెక్కల ప్రకారం అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో 759 గోల్స్‌తో జోసెఫ్ బికాన్ (చెక్ రిపబ్లిక్) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. మరో రెండు గోల్స్ చేస్తే రొనాల్డో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు లిఖిస్తాడు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 25 కోట్ల (250 మిలియన్లు) ఫాలోవర్లను సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో అమెరికాకు చెందిన పాప్ స్టార్ అరియానా గ్రాండే (214 మిలియన్లు), హాలీవుడ్ నటుడు 'ది రాక్' డ్వైన్ జాన్సన్ (209 మిలియన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి అత్యధికంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 8 కోట్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నాడు.
ప్రీమియర్ లీగ్‌లోని 20 క్లబ్‌లకు చెందిన అభిమానుల సంఖ్య 15 కోట్లు. అయితే ఒక్క జువెంటస్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డోనే అంతకు మించి ఫాలోవర్లను కలిగి ఉండటం విశేషం. ఫేస్‌బుక్, ట్విట్టర్ అభిమానుల సంఖ్యల్లోనూ రొనాల్డో దరిదాపుల్లో మరెవరులేరు. ప్రముఖ ఫుట్‌బాల్ ఛాంపియన్, అర్జెంటీనా స్టార్ లయనెల్ మెస్సీ ఇటీవలే పీలే రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఒకే క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ సాధించి పీలే రికార్డును బ్రేక్ చేశాడు. మెస్సీ 644 గోల్స్ సాధించి పీలే నెలకొల్పిన ఆల్‌టైమ్ క్లబ్ గోల్స్ (643) రికార్డును బద్దలు కొట్టాడు.