AFC ఛాంపియన్స్ లీగ్ రౌండ్ 16 ఫస్ట్ లెగ్‌లో ఆల్ ఫెయిహాపై అల్ నాస్ర్ విజయం సాధించింది. 1-0 గోల్ తేడాతో నెగ్గింది. ఆఖర్లో దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గోల్ సాధించాడు.
ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫహద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 39 ఏళ్ల రొనాల్డో 81వ నిమిషంలో గోల్ సాధించి జట్టును గెలిపించాడు.

మార్సెలో బ్రోజోవిక్‌తో కలిసి క్రిస్టియానో రొనాల్డో బాక్స్‌లో ప్రవేశించి ప్రత్యర్థి జట్టు గోల్‌కీపర్ వ్లాదిమిర్ స్టోజ్‌కోవిక్‌ను తెలివిగా బోల్తాకొట్టించాడు. బాల్‌ను చేజిక్కించుకోవడానికి వచ్చిన వ్లాదిమిర్ కుడి భుజం నుంచి రొనాల్డో గోల్ కొట్టాడు.
అయితే పోర్చుగల్ కెప్టెన్ రొనాల్డో ఫస్ట్ హాఫ్‌లో చాలా నిరాశచెందాడు. మొదటి అర్ధభాగంలో అండర్సన్ తలిస్కా అందించిన పాస్‌ను రొనాల్డో గోల్‌గా మలచలేకపోయాడు. దాంతో పాటు మరో హెడ్డర్‌ను గోల్‌కీపర్ చేతుల్లోకి పంపించాడు.
ప్రత్యర్థి జట్టు ఆల్ ఫెయిహా బలమైన డిఫెన్స్ ఆడింది. కానీ దాన్ని ఛేదించుకుంటూ ఆల్ నజర్ గోల్స్ చెయ్యడానికి తీవ్రంగా ప్రయత్నించింది. రెండో అర్ధభాగంలో గోల్ కొట్టడానికి మరిన్ని అవకాశాలు వచ్చాయి. 64వ నిమిషంలో మంచి అవకాశాన్ని అల్ నజర్ జట్టు వృథా చేసుకుంది. కాగా, లెగ్-2లో ఇరు జట్లు ఫిబ్రవరి 21వ తేదీన మరోసారి పోటీపడుతున్నాయి.