మాడ్రిడ్: చివరి వరకు ప్రాణాలపై ఆశలు వదులుకోని సిరియా చిన్నారులే నిజమైన హీరోలని లా లీగ జెయింట్స్ రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వ్యాఖ్యానించారు. 'నేను చాలా పేరొందిన ప్లేయర్ని. కానీ మీరు నిజమైన హీరోలు. మీరు మీ ఆశలు కోల్పోవడానికి సిద్ధంగా లేరు' అని రొనాల్డో ట్విట్టర్‌లో వీడియో మెసేజ్ పెట్టాడు.
'సేవ్ ది చిల్డ్రన్' ప్రచారకర్తగా ఉన్న ఈ పోర్చుగీస్ ప్లేయర్.. అంతర్యుద్ధం వల్ల చాలా ఎక్కువగా నష్టపోతున్న వారు చిన్నారులేనని పేర్కొన్నాడు. కానీ వారు తమ భవిష్యత్ ఆశలను ఏమాత్రం వదులుకోవడం లేదని వ్యాఖ్యానించాడు. 'యావత్ ప్రపంచం మీ వెంటే ఉంది. మీ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నది. నేనూ మీతోనే ఉన్నాను' అని ఆ వీడియో మెసేజ్ లో పేర్కొన్నాడు.
'హలో. ఇది సిరియా చిన్నారుల కోసం. యుద్ధం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసు. నేను ప్రసిద్ద ఆటగాడినే. కానీ మీరు నిజమైన హీరోలు. చివరి వరకు ఆశలు కొనసాగిస్తున్నారు' అని ట్వీట్ చేశాడు. అనాధలు, పేదల పిల్లలకు, కుటుంబాలకు సాయపడేందుకు 'సేవ్ ది చిల్డ్రన్' కార్యక్రమం ద్వారా చర్యలు చేపడుతున్నాడు.

నాలుగేళ్లుగా సిరియా అంతర్యుద్ధంతో సతమతమవుతున్నది. ఇటీవల అలెప్పో నగరాన్నిసిరియా సైన్యం స్వాధీనపర్చుకున్నప్పుడు వంద మందికి పైగా పిల్లలు తల్లిదండ్రులు లేకుండా ఒక భవనంలో బంధించబడి ఉన్నారు. వేల మంది ప్రజలు హత్యకు గురయ్యారు.
స్ట్రయికర్ పస్సీ, డిఫెండర్ లాల్లావ్మావ్మా ఒప్పందం
పుణె: వచ్చేనెలలో ప్రారంభం కానున్న ఐ - లీగ్ టోర్నీ కోసం డిఎస్‌కె శివాజీయన్స్ ఎఫ్‌సి యాజమాన్యం దేశీయ స్ట్రయికర్ సుమీత్ పస్సీ, డిఫెండర్ రిక్కీ లాల్లావ్మవ్వాతో ఒప్పందం కుదుర్చుకున్నది. చండీగఢ్ ఫుట్ బాల్ అకాడమీలో పస్సీ శిక్షణ పొందగా, ఈ ఏడాది ఐఎస్ఎల్ సీజన్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుకు, ఐ - లీగ్ టోర్నీలో స్పోర్టింగ్ క్లబ్ డి గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
జాతీయ జట్టు నుంచి రెండుసార్లు పోటీల్లో పాల్గొన్నాడు. సమీత్ పస్సీ తమ జట్టులో భాగంగా మారినందుకు సంతోషంగా ఉన్నది. తమ ఫార్వర్డ్ లైన్‌లో విభిన్నమైన డైమెన్షన్ గల ప్లేయర్ అందుబాటులోకి వచ్చాడని డిఎస్ కె కోచ్ డేవ్ రోజర్స్ వ్యాఖ్యానించాడు.
డిఎస్‌కె యాజమాన్యం ఐజ్వాల్ ఎఫ్ సి సారథి లాల్లావ్మవ్మాతోనూ ఒప్పందం కుదుర్చుకున్నది. 2015 - 16 సీజన్‌లో ఐజ్వాల్ ఎఫ్ సి డిఫెన్స్‌కు ఆయన పెట్టింది పేరు. మిజోరం యువతరం ప్రతిభను తాము వినియోగించుకోవడం గర్వంగా, సంతోషంగా ఉందని డేవ్ రోజర్స్ చెప్పాడు. ఆయన డిఫెన్సివ్ సామర్థ్యం, గేమ్ ఇంటెలిజెన్స్ తమకు ఎంతో ఉపయోగపడతాయన్నాడు. సంయమనం పాటిస్తూ బ్యాక్ లైన్‌పై ఉమ్మడి వ్యూహం అమలులో చాలా కీలక పాత్ర పోషిస్తాడని అన్నాడు.