
షాంఘై: చైనాలోని వుహాన్ కేంద్రంగా ప్రపంచానికి వ్యాపించిన మహమ్మారి కరోనా వైరస్ అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా క్రీడారంగానికి సంబంధించి అన్ని టోర్నీలు వాయిదా పడటం లేదా రద్దు చేయబడ్డాయి. అయితే చైనాలో కరోనా కట్టడికావడంతో ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాలో క్రీడలు సైతం ప్రారంభానికి సిద్దమవుతున్నాయి.
వైరస్ కారణంగా ఫిబ్రవరి 22న చైనాలో ప్రారంభమవ్వాల్సిన చైనీస్ సూపర్ లీగ్ (సీఎస్ఎల్) జూన్ లేదా జూలైలో నిర్వహిస్తారని క్లబ్ ఛైర్మన్ హువాంగ్ షెంఘువా అన్నారు. ప్రస్తుతం చైనాలో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో లీగ్‌ను నిర్వహిస్తారని షెంఘువా స్పష్టం చేశారు. ఈ సీజన్ పూర్తిస్థాయిలో జరుగుతుందని హువాంగ్ చెప్పినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
హువాంగ్ చెప్పినట్లు ఈ సీఎస్‌ఎల్ జరిగితే ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన ఎన్నో లీగ్‌లకు ఊపిరిపోసినట్లు అవుతుంది. సీఎస్‌ఎల్‌ను ఫాలో అవ్వడం వల్ల ఆయా దేశాల్లో పరిస్థితులు సద్దుమణిగాక ఆటలను తిరిగి ఎలా నిర్వహించాలనే విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది. మరీ ముఖ్యంగా యూరోపియన్ లీగ్‌లకు ఇదెంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.
మరోవైపు సీఎస్‌ఎల్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ మాజీ మిడ్‌ఫీల్డర్ మరౌనే ఫెల్లెని వైరస్‌బారిన పడి కోలుకున్నాడు. గత వారమే ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయి ఇంటికి చేరాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. తమ దేశంలో కరోనాను అరికట్టామని, విదేశాల నుంచి వచ్చేవారిలోనే ఇప్పుడు కొత్త కేసులు నమోదవుతున్నాయని చైనా పేర్కొంది. వైరస్ ప్రపంచవ్యాప్తంగా 2.33 మిలియన్ల మందికి పైగా సోకగా.. 160,000 మంది మరణించారు. సీఎస్ఎల్ మొదట ఫిబ్రవరి 22 న ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఈ లీగ్ వాయిదా పడ్డింది.