ఉమ్మడి లీగ్‌తోనే అవకాశాలు పుష్కలం: ఛెత్రి
న్యూఢిల్లీ: జాతీయంగా ఫుట్‌బాల్ ఆట ప్రగతి పథంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలంటే ఉమ్మడి లీగ్‌తోనే పుష్కల అవకాశాలు ఉంటాయని భారత్ ఏస్ ఫుట్‌బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది నాటికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్), ఐ-లీగ్ విలీనం జరుగుతుందన్న అంశంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సునీల్ ఛెత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఉమ్మడి లీగ్ నిర్వహణ వల్ల అంతర్జాతీయంగా అత్యధికంగా ఫిఫా ఫ్రెండ్లీ వాతావరణం నెలకొంటుందని, తద్వారా ర్యాంకింగ్స్ పెంపుదలకు ఆస్కారం ఏర్పడుతుందన్నాడు. 'నేను ఒక ఏడాదిలో ఫిఫాకు చెందిన 13 మ్యాచ్‌ల్లో ఆడాలని కోరుకుంటున్నా. మాకు అది అవసరం. ఉమ్మడి లీగ్ అందుబాటులో ఉంటేనే సాధ్యమవుతుంది' అని అన్నాడు.
'మేం దానికే ప్రాధాన్యం ఇస్తున్నాం. తద్వారా పలు టోర్నీల్లో పాల్గొనేందుకు అవకాశం చిక్కుతుంది. దేశం బయట సమర్థులైన జట్లతో ఆడాలని మా ఆశాభావం. మేం దేశానికి పరిమితం కావడం వల్లే పూర్తిగా పేలవమైన ఆట ఆడుతున్నాం. విజయమైనా, ఓటమైనా సరే కనీసం ఫుట్ బాల్ ఆడే దేశంగా ఎదిగేందుకు అవకాశం కావాలని మేం కోరుకుంటున్నాం' అని ఛెత్రి చెప్పాడు.

కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయి
విలీనం ఇష్టపడని వారు ఒక లీగ్ తో మరిన్ని టీంలతో ఎక్కువ కాలం ఆడేందుకు ముందుకు రావాలని, ఇందులో కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయని ఆయన అన్నాడు. ఆటువంటి పరిస్థితి వస్తుందని తాను ఆశిస్తున్నానని, అదే ఉమ్మడి లీగ్ అని చెప్పాడు. ఎస్ఎఎఫ్ఎఫ్ చాంపియన్ షిప్ టోర్నీ గెలుచుకుని, చారిత్రక స్థాయిలో బెంగళూరు ఎఫ్ సి తరఫున ఎఎఫ్‌సి ఫైనల్స్ లో అడుగు పెట్టడంతో ప్రస్తుత సీజన్ ఫలప్రదంగా సాగిపోయిందన్నాడు స్టార్ ప్లేయర్ ఛెత్రి. ప్రస్తుతం తనకు చాలా చిన్న చిన్న లక్ష్యాలు ఉన్నాయని చెప్పాడు.

గురుప్రీత్ వంటి ప్లేయర్ బాగా ఎదుగుతున్నారు
పది రోజుల్లో, ఒక వారంలో ఐ-లీగ్‌లో లాజోంగ్ క్లబ్ జట్టుతో జరిగే మ్యాచ్ పైనే తన దృష్టి ఉందన్నాడు. తాము సొంత గడ్డపై ఆడుతున్నామని అదే తమ లక్ష్యమని చెప్పాడు. ఆటగాళ్లు ఒక స్థాయికి చేరుకుంటే పురోగతి సాధించగలమని అన్నాడు. గురుప్రీత్ వంటి ప్లేయర్ చాలా బాగా ఎదుగుతున్నాడన్నాడు. తొలుత ఆసియా ఖండంలో 10వ స్థానానికి చేరుకుంటే చాలునన్నాడు. తొలుత ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించి తర్వాత 15, 16వ స్థానాల్లో నిలబడిగలిగితే తదుపరి ఫైనల్స్ దశకు చేరుకునే అంశంపై కేంద్రీకరించొచ్చన్నాడు. తాము సరైన దిశలోనే ప్రయాణిస్తున్నామన్నాడు.

టోర్నీల్లో మ్యాచ్‌ల మధ్య తేడా సమస్యే కాదు
ఐ-లీగ్, ఎఎఫ్‌సి టోర్నీల్లో మ్యాచ్‌ల మధ్య కొద్ది తేడా ఉన్నా సమస్యే కాదన్నాడు. ఐ లీగ్ పూర్తి చేయడానికి ఐదు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత ఎఎఫ్ సి గురించి ఆలోచించడం కష్ట సాధ్యమన్నాడు. కనుక ఐ - లీగ్ నిర్వాహకులపై విమర్శలు చేయడం సరి కాదన్నాడు. కోచ్‌ల శిక్షణలో ఒకే రకమైన పద్ధతులు ఉంటాయని ఛెత్రి తెలిపాడు. జట్టు విజయానికి వివిధ రకాల విధానాలు అమలులోకి తెస్తారని, ప్రధానంగా గెలుపొందే వ్యూహమే ముఖ్యమన్నాడు.

ఎఎఫ్‌సి టైటిలే బెంగళూరు ఎఫ్‌సి లక్ష్యం
ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి) టైటిల్ గెలుచుకోవడమే తమ లక్ష్యమని సునీల్ ఛెత్రి అన్నాడు. ఈ ఏడాది ఐ - లీగ్ టైటిల్ గెలుచుకున్న బెంగళూరు జట్టు ఎఎఫ్‌సి కప్ ఫైనల్స్‌లో ఓటమి పాలైంది. వచ్చే ఏడాది ఐ - లీగ్ టైటిల్ గెలుచుకోవడంతోపాటు ఎఎఫ్‌సి ఫైనల్స్ దశకు చేరుకోవడం కష్ట సాధ్యమైన పని అని పేర్కొన్నాడు. ఎఎఫ్‌సి టైటిల్ బరిలోకి దిగడంతో తాము చాలా అనుభవం సాధించామన్నాడు. వచ్చే ఏడాది సీజన్ కోసం వేచి చూస్తున్నామన్నాడు. వచ్చేనెల ఏడో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐ - లీగ్ టోర్నీలో కోల్‌కతా జెయింట్స్ మొహున్ బగన్, ఈస్ట్ బెంగాల్ జట్లతో మ్యాచ్‌ల్లో గెలవడం కష్ట సాధ్యమన్నాడు. మిగతా జట్లలో కొన్ని కొత్త జట్లు ఉన్నాయని, వచ్చే సీజన్ విభిన్నంగా, కష్టంగా ఉంటుందని ఛెత్రి తెలిపాడు. ప్రతి జట్టును సానుకూలంగానే చూడాలన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications