జోహాన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికాకు సాకర్ ఆతిథ్యం లభించడంలో పదిహేనేళ్ళపాటు విశేష కృషి చేసిన నెల్సన్ మండేలా టోర్నీ ఆరంభోత్సావాలకు హాజరుకావడంపై సందిగ్దత నెలకొంది. జూలై 18వ తేదీతో తొంభైరెండో వడిలో ప్రవేశించనున్న మండేలా ఇప్పటికే ప్రజా కార్యక్రమాలకు దూరమైనందున ప్రారంభోత్సావాలకు హాజరయ్యే అవకాశాలు తక్కువని టోర్నీ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు మండేలా కుటుంబ వర్గాలు మాత్రం టోర్నీకి హాజరయ్యే అవకాశాలను కొట్టిపారేయలేకపోవడం విశేషం. అయితే వీడియో కాన్ఫరెన్స్ లో నైనా ఆయన కన్పించే అవకాశముంది.
సాకర్ ఆతిధ్యం దక్షిణాఫ్రికాకు దక్కేలా చూడడానికి మండేలా చేసిన కృషి అమోఘం. ఆరేళ్ల క్రితం జ్యూరిచ్ లో ఫిఫా అధ్యక్షుడు జోసెఫ్ బ్లాటర్... 'సాకర్-10' ఆతిథ్యాన్ని దక్షిణాఫ్రికాకు కట్టబెడుతున్నట్టుగా ప్రకటించిన క్షణంలో పలికిన మాటల్ని బట్టివిశ్లేషిస్తే ఈ నల్ల జాతి సూరీడు వహించిన పాత్ర ఏమొటో తెలుస్తుంది.
'ఫిఫా వరల్డ్‌కప్ ఆతిథ్యాన్ని దక్షిణాఫ్రికాకు వచ్చేలా చేయడంలో మీ పాత్ర చిరస్మరణీయం. మీ అకుంఠిత దీక్ష..పట్టుదల వల్లే ఇది సాథ్యమైంది' అని బ్లాటర్ మండేలాను కొనియాడారు. నిజానికి కూడా దక్షిణాఫ్రికాకు ఈ వరల్డ్‌కప్ ఆతిథ్యం రాత్రికి రాత్రే రాలేదు.
1995 రగ్బీ వరల్డ్ కప్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించేలా ప్రోత్సహించింది మొదలు...పలు మేజర్ టోర్నీలను తమ దేశంలో విజయవంతంగా నిర్వహించేలా చూడడం...ఈ క్రమంలో 'ఫిఫా'ను సంతృప్తి పరచడం ద్వారా మండేలా సుదీర్ఘ క్రతువు నడిపారు.