బెంగుళూరు: ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ కప్ (ఏఎఫ్‌సీ)లో భారత్ సాకర్ కెప్టెన్ సునీల్ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు క్లబ్ (బీఎఫ్‌సీ) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నమెంట్‌లో ఫైనల్ కు చేరిన తొలి భారత క్లబ్‌గా రికార్డుని సొంతం చేసుకుంది.
బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు 3-1 తేడాతో మలేసియా జట్టు, డిఫెండింగ్ చాంపియన్ జొహొర్ దారుల్ తక్‌జీమ్‌పై విజయం సాధించింది. కెప్టెన్ ఛెత్రి (41వ, 67వ) రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ సెమీస్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో మొత్తం స్కోరు పరంగా చూస్తే బెంగళూరు 4-2తో ఆధిక్యం ప్రదర్శించి పైనల్‌కు అర్హత సాధించింది. దీంతో ఏఎఫ్‌సీ ఫైనల్ చేరిన తొలి భారత క్లబ్ జట్టుగా బెంగళూరు చరిత్ర సృష్టించింది.
కెప్టెన్ సునీల్ ఛెత్రి 41, 66వ నిమిషంలో రెండు గోల్స్ చేయగా, మరో ఆటగాడు జువనన్ 75వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. ఇక జొహొర్ జట్టు ఆటగాడు సఫీఖ్ రహమాన్ 11వ నిమిషంలో ఒకే ఒక్క గోల్ సాధించాడు. వచ్చే నెల 5వ తారీఖున కతార్‌లో జరిగే ఫైనల్లో ఇరాక్ ఎయిర్‌ఫోర్స్ క్లబ్ జట్టుతో బెంగళూరు ఎఫ్‌సీ తలపడనుంది.