దర్బన్: ఆస్ట్రేలియా గోల్ కీపర్ బ్రాడ్ జోన్స్ ప్రపంచ కప్ నుంచి వైదొలిగాడు. అతను ఇంటికి వెళ్లి కుటుంబంతో ఉంటాడని, తిరిగి రాకపోవచ్చునని కోచ్ పిమ్ వెర్బీక్ ఆదివారం చెప్పారు. ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి వారం రోజులు ఉందనగా శనివారం అతను స్వదేశానికి తిరిగి వెళ్లాడు. అతను వెళ్లిపోవడానికి అనుమతి ఇచ్చామని, అతని ఇష్టం ఉన్నంత వరకు కుటుంబతో గడపవచ్చునని ఆయన అన్నారు. అతను తిరిగి రాకపోవచ్చుని, దాన్ని బట్టి విషయ తీవ్రతను అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.
ఇష్టమైతే జోన్స్ తిరిగి రావచ్చునని, అయితే అతని స్థానంలో మరొకరి కోసం ఫిఫాను అనుమతి అడిగామని ఆయన చెప్పారు. అధికారిక జట్టులో లేకపోయినప్పటికీ గోల్ కీపర్ యూజెన్ గలేకోవిక్ దక్షిణాఫ్రికాలో శిక్షణ పొందుతున్నాడు. జోన్స్ స్థానంలో అతను జట్టులోకి రావచ్చు. ఆస్ట్రేలియా జూన్ 13వ తేదీన జర్మనీతో, జూన్ 19వ తేదీన ఘనాతో, జూన్ 23వ తేదీన సెర్బియాతో తలపడనుంది.