
బ్యూనోస్ ఏరీస్: ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా గుండెపోటుతో గత బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. డీగో మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. ఇదిలాఉంటే.. మారడోనా మృతిపై ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. మారడోనాకు చికిత్స అందించడంలో ఆయన వ్యక్తిగత వైద్యుడు, న్యూరాలజిస్ట్ లియోపొల్డో ల్యూక్ నిర్లక్ష్యం వహించినట్టు పలు సందేహాలు తలెత్తాయి. మారడోనా కుమార్తెలు దల్మా, గియానినా, జనా సైతం ఈ అనుమానాలను వ్యక్తం చేశారు.
మరోవైపు మారడోనా, ల్యూక్ మధ్య గొడవ జరిగినట్లు కొంత మంది ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో అర్జెంటీనా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఉదయం ల్యూక్ ఇల్లు, క్లినిక్‌లో సోదాలు నిర్వహించారు. విచారణలో పోలీసులకు సహకరిస్తున్నానని, మారడోనా చికిత్సకు సంబంధించి తనవద్ద ఉన్న అన్ని వైద్య రికార్డులతో పాటు కంప్యూటర్, సెల్‌ఫోన్‌లను పోలీసులకు అందజేసినట్లు ల్యూక్ వెల్లడించారు. మారడోనాకు సాధ్యమైనంత మేర మెరుగైన చికిత్స అందించానని పేర్కొన్నారు.
ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ... 'ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యక్ష సాక్షులతో పాటు కుటుం సభ్యులందరితో మాట్లాడుతున్నాం. అయితే మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. మారడోనా మరణ ధ్రువీకరణ పత్రంపై ఎవరి సంతకం లేదు. అలాగని దీన్ని అనుమానాస్పద మృతిగా భావించలేం. మారడోనా మెడికల్ రికార్డులు, ఆయన ఇంటి సమీపంలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. టాక్సికోలాజికల్ రిపోర్ట్ వచ్చిన తరువాత ఈ కేసును ముందుకు తీసుకువెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నాం' అని చెప్పారు.
మారడోనా ఆకస్మిక మరణంపై ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర కలత చెందుతున్న సమయంలో.. డీగో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చికిత్సతో పాటు అత్యవసర సమయంలోనూ వ్యక్తిగత వైద్యులు సరిగ్గా స్పందించలేదని మారడోనా కుమార్తెలు ఇదివరకే ఆరోపించారు. ఆయనను ఆసుపత్రికి తరలించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు పేర్కొన్నారు. అంబులెన్స్ చేరుకునేందుకు అరగంటకు పైగా సమయం పట్టిందని, ఇది కచ్చితంగా మూర్ఖత్వమేనని మారడోనా తరపు న్యాయవాది అన్నారు. ఇలా మారడోనా మరణంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అర్జెంటీనా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.