బ్యూనస్‌ఎయిర్స్: ఆటపై, తమ జట్టుపై ఆటగాళ్లకు, ప్రజలకు అభిమానం ఉంటే మంచిదే. అయితే ఆ అభిమానం ఓ వ్యక్తి ప్రాణం తీసేదిగా ఉంటేనే ఆటపై తీవ్ర పరిణామాలు చూపిస్తాయి. అలాంటి ఘటనే లాటిన్ అమెరికాలోని అర్జెంటీనాలో చోటు చేసుకుంది. ఇక్కడ అలాంటి తీవ్రమైన భావాలున్న అభిమానుల చేతిలో ప్రత్యర్థి ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాలో థర్డ్ టైర్ లీగ్ పోటీల్లో భాగంగా టిరో ఫెడరల్, చకారిటా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఆటగాళ్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆట 15 నిమిషాలపాటు నిలిచిపోయింది. ఆ తర్వాత 3-1 స్కోరు తేడాతో టిరో ఫెడరల్ జట్టు విజయం సాధించిందని రెఫరీ ప్రకటించారు.

వివాదానికి కారణమైన ఎనిమిది మంది ఆటగాళ్లు తొలగించబడ్డారు. కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత ఓటమిపాలైన జట్టుకు చెందిన ఓ ఆటగాడు, కొందరు అభిమానులతో కలిసి వచ్చి.. టిరో ఫెడరల్ జట్టు కెప్టెన్ ఫ్రాంకో అంటోనియో నీటోపై దాడి చేశాడు. ఈ దాడిలో చకారిట జట్టు అసిస్టెంట్ కోచ్ తోపాటు ఓ గూండా కూడా పాల్గొన్నాడు.
కాగా, ఈ దాడిలో నీటో తలకు బలమైన గాయాలయ్యాయి. అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆదివారం జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నీటో బుధవారం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. దాడికి పాల్పడిన నిందితులలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.