
హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బ్రెయిన్ సర్జరీ విజయవంతం కావడంతో బ్యూనస్ ఎయిర్స్‌లోని ఆస్పత్రి నుంచి మారడోనాను బుధవారం రీలిజ్ చేశారు. అక్కడి నుంచి డీగోను పునరావాస కేంద్రానికి తరలించారు. అక్టోబర్ 30తో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న మారడోనా మెదడులో రక్తం గడ్డకట్టడంతో బ్యూనోస్ ఎయిర్స్‌లో అడ్మిట్ అయిన ఆయనకు డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ఆ క్లాట్‌ను తొలిగించారు. అర్జెంటీనా జట్టుకి మారడోనా 1986లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ అందించారు.
'మారడోనా తలలో రక్తం గడ్డకట్టుకుపోవడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఆయన కోలుకున్నారు' అని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఫుట్‌బాల్ లెజెండ్ మారడోనా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని అతని న్యాయవాది మాటియస్ మోర్లా ఓ ప్రకటనలో తెలిపారు. తన జీవితంలో మారడోనాకు ఇది కష్టమైన సమయం అని న్యాయవాది అన్నారు.
వృధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న మారడోనా తరుచూ ఆనారోగ్యనాకి గురవుతున్నారు. 15 రోజుల క్రితం స్వల్ఫ అస్వస్థతకు గురైన మారడోనాను లా ప్లాటాలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం మెుదడులో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బ్యూనస్ ఎయిర్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆ క్లాట్‌ను తొలిగించారు. 60 ఏళ్ల మరడోనాకు ఇప్పటికే రెండు సార్లు గుండెపోటు రాగా.. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. అలాగే హెపటైటిస్ బారిన కూడిన పడ్డారు.
దిగ్గజం డీగో మారడోనా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో అతని ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో శుభాకంక్షలు తెలుపుతున్నారు. గతవారం మారడోనా పరిస్థితి బాలేదని తెలిసిన ఆయన అభిమానులు ఆసుపత్రికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. అతని బ్యానర్లతో 'క్షేమంగా రండి, డియెగో' అంటూ క్లినిక్ వెలుపల ఉత్కంఠగా ఎదురుచూశారు. శస్త్రచికిత్స అయ్యేంతవరకు ఆసుపత్రి గేట్ బయటే ఉన్నారు. శస్త్రచికిత్స విజయవంతమయ్యాక సంబరాలు చేసుకున్నారు.