హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని మెస్సీ భార్య ఆంటోనెల్లా రొకుజా అధికారికంగా ప్రకటించింది. 'మా కుటుంబంలోకి త్వరలో ఐదో వ్యక్తి వస్తున్నారు' అని ఆంటోనెల్లా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే మెస్సీ దంపతులకు ఇప్పటికే నాలుగేళ్ల తియాగో, రెండేళ్ల మాటెయో అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలైన ఆంటోనెల్లాతో చాన్నాళ్లు డేటింగ్ చేసిన మెస్సీ, ఈ ఏడాది జూలైలో ఆమెను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు.
ఇదిలా ఉంటే ఇటీవలే అర్జెంటీనాకు వరల్డ్ కప్ బెర్త్ సాధించిపెట్టాడు లియోనల్ మెస్సీ. వరల్డ్ కప్ అర్హత కోసం ఆడిన చివరి మ్యాచ్‌లో మెస్సీ అద్భుత ప్రదర్శన చేయడంతో అర్జెంటీనా 3-1తో ఈక్వెడార్‌పై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ తొలి 20 నిమిషాల్లో రెండు గోల్స్, సెకండాఫ్‌లో మరో గోల్‌తో ఒంటి చేత్తో అర్జెంటీనాను గెలిపించాడు. దీంతో దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్, ఉరుగ్వే, కొలంబియా తర్వాత అర్జెంటీనా వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించింది.