
అసలేం జరిగిందంటే?
ఖతర్‌లో లుసైల్ స్టేడియంలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభమైన 23వ నిమిషంలోనే లియోనెల్ మెస్సీ తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే డి మరియా కూడా మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఫ్రాన్స్ జట్టు ఏ మాత్రం పుంజుకునేలా కనిపించలేదు.
అయితే చివర్లో 80వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను ఎంబాపే గోల్‌గా మలిచాడు. ఆ వెంటనే మరో గోల్ కూడా చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఎక్స్‌ట్రా టైంలో కూడా మెస్సీ ఒక గోల్ చేసి అర్జెంటీనాకు ఆధిక్యం అందిస్తే.. ఎంబాపే మరో గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. చివరకు పెనాల్టీ షూటవుట్‌లో 4-2 తేడాతో అర్జెంటీనా నెగ్గింది.

మెస్సీ చేసిన ఆ గోల్ చెల్లదు!
ఎక్స్‌ట్రా టైంలో మెస్సీ చేసిన గోల్ చెల్లదని ఫ్రాన్స్ అభిమానులు అంటున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి. ఫ్రాన్స్ గోల్ కీపర్ హ్యూగో లోరిస్ ఒక గోల్ ప్రయత్నాన్ని అడ్డుకున్న సమయంలో బంతి అతనికి తగిలి రీబౌండ్ అయింది. దీన్ని అందుకున్న మెస్సీ తన కుడికాలుతో గోల్ చేశాడు. ఆ సమయంలో మెస్సీ ఆఫ్‌సైడ్ రూల్ ఉల్లంఘించినట్లు కనిపించింది.
కానీ స్పష్టంగా లేకపోవడంతో అర్జెంటీనాకు గోల్ దక్కింది. తర్వాత ఎంబాపే కూడా మరో గోల్ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే మెస్సీ గోల్ చేసే సమయంలో కొందరు అర్జెంటీనా సబ్‌స్టిట్యూట్లు సెలబ్రేట్ చేసుకునేందుకు మైదానంలో అడుగు పెట్టారు. దీన్ని పాయింట్ చేసి చూపిస్తున్న ఫ్యాన్స్.. అసలు ఈ గోల్ లెక్కలోకి రాదని వాదిస్తున్నారు.
ఫిఫా రూల్స్ ఏం చెప్తున్నాయి?
ఫ్రాన్స్ అభిమానులు చేస్తున్న వాదన కూడా సరైందే. ఎందుకంటే ఫిఫా నిబంధనల ప్రకారం, మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. వాళ్లు కాకుండా వేరే ఆటగాళ్లు కనుక మైదానంలో అడుగు పెడితే.. దాన్ని అంపైర్ గమనిస్తే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో జట్టు చేసిన గోల్‌ను లెక్కలోకి తీసుకోకూడదు. కానీ అర్జెంటీనా గోల్ చేసినప్పుడు ఇతర ఆటగాళ్లు మైదానంలోకి రావడాన్ని అంపైర్లు గమనించలేదు. ఈ నిబంధన అమలై ఉంటే అర్జెంటీనా చేసిన మూడో గోల్ లెక్కలోకి వచ్చేది కాదు. ఆ తర్వాత ఎంబాపే గోల్ చేయడంతో విజయం ఫ్రాన్స్‌కే దక్కేది.


Click it and Unblock the Notifications














