
న్యూయార్క్: ఇటీవలి కాలంలో మైదానంలోనే ప్రపోజ్ చేసుకోవడం కామన్ అయిపొయింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు. ఫాన్స్ మాత్రమేనా.. మేము కూడా ప్రపోజ్ చేస్తామని ఓ ఫుట్‌బాలర్ నిరూపించాడు. అమెరికన్ ఫుట్‌బాలర్ హసానీ డాట్సన్ స్టీఫెన్‌సన్ తన గర్ల్‌ఫ్రెండ్‌కు గ్రౌండ్‌లోనే ప్రపోజ్ చేశాడు. మేజర్ లీగ్ సాకర్ టోర్నీలో భాగంగా ఆదివారం మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్ జోస్ ఎర్త్‌క్వేక్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.
మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్ జోస్ ఎర్త్‌క్వేక్స్ మధ్య మ్యాచ్ డ్రాగా ముగియగానే హసానీ స్టీఫెన్‌సన్ మైదానంలో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్ పెట్రా వుకోవిక్ దగ్గరికి వెళ్లాడు. మొకాలిపై కూర్చొని 'విల్ యు మ్యారీ మీ' అని ఉంగరంతో ప్రపోజ్ చేశాడు. స్టీఫెన్‌సన్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో పెట్రా షాక్‌కు గురైంది. ఆపై అతని ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. అనంతరం ఉంగరాన్ని ప్రేయసి చేతికి తొడగి.. తన ప్రేమను జీవితాంతం గుర్తుండిపోయేలా చేశాడు. తర్వాత ఇద్దరూ కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడంతో స్టేడియం అంతా హోరెత్తిపోయింది.
తన ప్రేమను వ్యక్తపరిచిన క్షణాలకు సంబంధించిన వీడియోను హసానీ స్టీఫెన్‌సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్టీఫెన్‌సన్ ప్రపోజ్ చేసిన ఫోటోలను తన ప్రేయసి పెట్రా వుకోవిక్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 'నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నీలాంటి వ్యక్తి ప్రేమ దొరినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. నా జీవితంలో ఈ అందమైన క్షణాలను మధుర జ్ఙాపకంగా ఉంచడంలో సహయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేసింది.
సాకర్ టోర్నీలో భాగంగా ఆదివారం మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్ జోస్ ఎర్త్‌క్వేక్స్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రా అయింది. మిన్నెసోటా ఎఫ్‌సీకి హసానీ స్టీఫెన్‌సన్ ఆడుతున్నాడు. వెస్ట్రన్ కాన్ఫరెన్స్‌లో మిన్నెసోటా 11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. టేబుల్ టాపర్ సీటెల్ (26 పాయింట్లు) కంటే 11 పాయింట్లు వెనకంజలో ఉంది. కాన్సాస్ సిటీ (23), ఎల్‌ఎ (21), కొలరాడో (17) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈస్ట్రన్ కాన్ఫరెన్స్‌లో న్యూ ఇంగ్లండ్ 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.