
హైదరాబాద్: అబుదాబి వేదికగా జరుగుతున్న ఏఎఫ్‌సీ ఆసియాకప్ నుంచి భారత్ నిష్క్రమించింది. అద్భుతమైన ఆటతీరుతో వరుస విజయాలు సాధిస్తూ ఏఎఫ్‌సీ ఆసియాకప్ ఆడేందుకు అర్హత సాధించిన భారత పుట్‌బాల్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం జరిగిన గ్రూప్-ఎ కీలక పోరులో ఛెత్రి సేన 0-1తో బహ్రెయిన్ చేతిలో పరాజయం చవిచూసింది.
తొలి లీగ్ మ్యాచ్‌లో థాయిలాండ్‌పై 4-1 స్కోరుతో విజయం సాధించిన భారత్.. యూఏఈతో జరిగిన రెండో లీగ్‌లో 0-2తో ఓడింది. అయినా ఏఎఫ్‌సీ ఆసియాకప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌ను గెలిచినా లేదంటే కనీసం డ్రా చేసుకున్నా నాకౌట్ చేరే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.
మ్యాచ్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడిన భారత స్ట్రైకర్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై పలుమార్లు దాడులు చేసినా ఫినిషింగ్ లోపాలతో గోల్ కొట్టలేకపోయారు. తొలి అర్థభాగం ముగిసినా రెండుజట్లూ గోల్ సాధించలేకపోయాయి. రెండో అర్థభాగంలోనూ ఇరుజట్లూ హోరాహోరీగా పోరాడినా.. గోల్ సాధించలేకపోయాయి.
మరో నిమిషంలో రెండో అర్ధభాగం ముగియనుండగా.. బహ్రెయిన్ జట్టుకు లభించిన పెనాల్టీని జమాల్ రషీద్ (91వ నిమిషం) గోల్‌గా మలచడంతో టోర్నీలో భారత్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు యూఏఈ, థాయిలాండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 1-1స్కోరుతో డ్రాగా ముగిసింది. దీంతో భారత్ మినహా గ్రూప్‌లో మిగిలిన మూడు జట్లూ నాకౌట్ చేరాయి.