
ఢిల్లీ: ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్, 2022లో ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తమకు ద్వంద్వ ప్రయోజనం లభించనుందని భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్ అదితి చౌహాన్ అన్నారు. ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచకప్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనుంది. మరోవైపు 2022లో దేశం ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఏషియన్ కప్ 2022కి ఆతిథ్యం ఇవ్వనుంది.
తాజాగా అదితి చౌహాన్ మాట్లాడుతూ... 'ఫిఫా అండర్ -17 ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఆసియా కప్ వస్తుంది. ఇది మా జట్టుకు ద్వంద్వ ప్రయోజనం. ఇది చాలా గొప్ప వేదిక. జట్టులోని ప్రతిఒక్కరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నాం. మంచి డైట్ పాటిస్తున్నాం' అని చౌహాన్ చెప్పినట్లు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ సమాఖ్య అధికారిక వెబ్‌సైట్ ఏఐఎఫ్‌ఎఫ్ పేర్కొంది.
'ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద వేదిక. అందులోనూ మన దేశం ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ రెండు టోర్నీలు మాకెంతో ఉపయోగపడుతాయి. ప్రేక్షకులు, మీడియా, స్పాన్సర్లు ముందుకొచ్చి ఈ టోర్నీలను విజయవంతం చేయాలని కోరుతున్నా' అని అదితి చౌహాన్ అన్నారు. భారత మహిళా జట్టులో ఇటీవల జరిగిన ఎక్స్‌పోజర్ టూర్ల గురించి ప్రస్తావిస్తూ.. వారు జట్టులో చాలా పెద్ద మార్పు చేశారని అభిప్రాయపడ్డారు.
తాము నిరంతరం ఆటతీరును మెరుగుపరుచుకుంటున్నామని, టాప్ జట్లతో జరిగిన పోటీల్లో విజయం సాధించామని అదితి చౌహాన్ పేర్కొన్నారు. జట్టులోని వారందరం ఒకరినొకరు బాగా అర్థంచేసుకున్నామని, క్రీడాస్ఫూర్తిని చాటుతున్నామన్నారు. గతకొంత కాలంగా మహిళల ఆట చాలా అభివృద్ధి చెందిందని ఆమె పేర్కొన్నారు. అండర్ -17 ఉమెన్స్ ప్రపంచకప్లో సత్తాచాటుతామని చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు.
మహిళా ఫుట్‌బాల్ కెప్టెన్, ఫార్వర్డ్ బాలాదేవీలా ఆడడానికి ఎక్కువ మంది భారత మహిళ జట్టు సభ్యులు అనుకరిస్తారని అదితి అభిప్రాయపడ్డారు. విఖ్యాత స్కాట్లాండ్ ఫుట్‌బాల్ క్లబ్ రేంజర్స్ ఎఫ్‌సీకి ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని బాలాదేవీ దక్కించుకున్నారు. దీంతో విదేశీ క్లబ్ కాంట్రాక్టు సాధించిన భారత తొలి మహిళా సాకర్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. బాలాదేవి 18 నెలలు పటు రేంజర్స్ క్లబ్ తరఫున ఆడనున్నారు.