హైదరాబాద్: భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న అండర్-17 వరల్డ్ కప్ పుట్ బాల్ టోర్నమెంట్‌లో ఆడుతున్న భారత జట్టుకి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన విషెస్ తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో సచిన్ తన వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకి అమెరికా జట్టుతో భారత్ తొలిపోరులో తలపడనుంది.
'వరల్డ్‌కప్‌లో ఆడబోతున్న భారత ఫుట్‌బాల్ అండర్-17 జట్టుకి నా బెస్ట్ విషెస్. మీ ఆటని ఎంజాయ్ చేస్తూ కలల్ని సాకారం చేసుకోండి' అంటూ సచిన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. భారత్‌లోని ఆరు ప్రధాన వేదికల్లో ఢిల్లీ, ముంబై, గోవా, కోచి, గౌహతి, కోల్‌కతా నగరాలు ఈ ఫిపా వరల్డ్ కప్‌కి ఆతిథ్యమిస్తున్నాయి.

అక్టోబర్ 6 నుంచి 28 వరకు జరగనున్న ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 52 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీలోని జవహర్‌లాల్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవం కార్యక్రమం జరగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్నారు.
ఏ స్థాయిలోనైనా భారత్ తొలిసారి ఓ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యమిస్తోండటం ఇదే తొలిసారి. ఆతిథ్య జట్టు హోదాలో ఈ టోర్నీలో తొలిసారి భారత్ బరిలోకి దిగుతోంది. ఆసియాలో ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించడమే ప్రధాన ఉద్దేశంతో ఫిఫా యువ ఆటగాళ్ల ఆతిథ్య హక్కులను అత్యధికసార్లు ఆసియా దేశాలకే కట్టబెట్టింది.
ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న ఐదో ఆసియా దేశం భారత్. చైనా (1985), జపాన్ (1993), కొరియా (2007), యూఏఈ (2013)లో ముందుఉన్నాయి. ఈ టోర్నీలో ఆడే సువర్ణావకాశాన్ని దక్కించుకున్న భారత జట్టుకు అమర్‌జిత్‌సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. గ్రూప్-ఎలో ఉన్న భారత్.. టోర్నీ తొలి రోజు యూఎస్‌ఏతో తొలి మ్యాచ్ ఆడనుంది.
దేశం గర్వపడేలా ఆడండి: విరాట్ కోహ్లీ
ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌లో పాల్గొనబోతున్న భారత ఆటగాళ్లు దేశం గర్వపడేలా ఆడాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. 'అక్టోబర్ 6న భారత జట్టు ఫిఫా అండర్-17 ప్రపంచకప్‌లో పాల్గొనబోతోంది. యూఎస్‌ఏతో తొలి మ్యాచ్‌లో తలపడబోతోంది. గర్వపడేలా ఆడండి' అని ట్విట్టర్‌లో వీడియో పోస్టు పెట్టాడు.