హైదరాబాద్: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరికింది. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలికిన తర్వాత ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు.
ధోని భార్య సాక్షి తన ఇనిస్టాగ్రాంలో పోస్టు చేసిన ఓ వీడియోనే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా ఆదివారం నాడు చెన్నయిన్ ఎఫ్‌సి, నార్త్ఈస్ట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ని వీక్షించేందుకు ధోని తన కుటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లాడు.
కుటుంబంతో చెన్నైకి బయల్దేరిన ధోని ప్లయిట్‌లో తన పక్క సీటులో కుమార్తె జీవాను కూర్చొబెట్టుకున్నాడు. ప్లయిట్ టేకాఫ్ అవడానికి ముందు విమాన సహాయకురాలు ధోనికి చెప్తోన్న సూచనలను ధోని పక్కనే కూర్చున్న జీవా కూడా ఎంతో శ్రద్ధగా విన్నది. దీనిని వీడియో తీసి ధోని భార్య సాక్షి తన ఇనిస్టాగ్రాంలో పోస్టు చేసింది.
ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌లా మారింది. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరిస్‌ను ధోని నేతృత్వంలోని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక చెన్నయన్ ఎఫ్‌సి, నార్త్ ఈస్ట్ జట్ల మధ్య జరిగిన ఐఎస్ఎల్ మ్యాచ్‌ని వీక్షిస్తున్న ధోని కుటుంబం. ఐఎస్ఎల్‌లో చెన్నైయిన్ ఫ్రాంచైజీకి ధోని సహా యజమానిగా ఉన్నాడు.