
క్రికెట్ ఫాలో అయ్యే వాళ్లకు చాలా వింత ఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. సడెన్‌గా మైదానంలోకి పరుగులు తీసే అభిమానులు.. ఆటకు అంతరాయం కలిగించే జంతువులు. బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచులు.. ఇలా క్రికెట్‌లో జరిగే చాలా అంశాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. అలాంటి ఒక ఘటనే న్యూజిల్యాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అభిమానులకు షాకిచ్చింది. అది చూసిన వాళ్లందరూ ఇది నిజమేనా? అని నోరెళ్లబెట్టాల్సి వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
న్యూజిల్యాండ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టు.. టెస్టు సిరీసులో ఓడిన సంగతి తెలిసిందే. అనంతరం ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలోనే కివీస్, లంకేయుల మధ్య ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే శ్రీలంక బౌలర్ చమిక కరుణరత్నే అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కరుణరత్నే చెలరేగడంతో కివీస్ జట్టు 274 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆ తర్వాత ఛేజింగ్‌లో కివీస్ బౌలర్లు కూడా రెచ్చిపోయారు. దీంతో లంక బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో బంతితో రాణించిన కరుణరత్నే.. ఈసారి బ్యాటుతో కూడా జట్టును ఆదుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి ప్రిపేర్ అయి క్రీజులోకి వచ్చిన అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. దీని వల్ల క్లియర్‌గా రనౌట్ అయినా కూడా అతను నాటౌట్ అని అంపైర్లు నిర్ణయించారు. బ్లెయిర్ టికనర్ వేసిన 19వ ఓవర్లో బంతిని ఆడిన కరుణరత్నే వెంటనే సింగిల్ తీయడానికి పరుగు తీశాడు.
ఆ బంతిని అందుకున్న ఫీల్డర్.. నాన్ స్ట్రైకర్‌కు దాన్ని విసిరాడు. దాన్ని అందుకున్న బౌలర్ వెంటనే వికెట్లను కూల్చాడు. అయితే ఇక్కడే కరుణరత్నే అదృష్ట దేవత నవ్వింది. అతను క్రీజులోకి రాకముందే బెయిల్స్ గాల్లోకి లేచాయి. ఇలా బంతి తగలగానే వెలగాల్సిన జింగ్ బెయిల్స్ వెలగలేదు. వాటిలో బ్యాటరీలు అయిపోయాయి. అయినా అంపైర్లు అవుట్ ఇచ్చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అంపైర్లు మాత్రం జింగ్ బెయిల్స్ వెలగని కారణంగా కరుణరత్నేను నాటవుట్ అని తేల్చారు. ఇది చూసిన లంక అభిమానులు సంతోషించగా.. కివీస్ ఆటగాళ్లు నోరెళ్లబెట్టారు. కానీ చివరకు లంక 76 పరుగులకే కుప్పకూలడంతో కివీస్ భారీ విజయం సాధించింది.