జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఐర్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో 21 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయినా, పట్టుదలతో పోరాడి ఐర్లాండ్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 210 పరుగులు చేసింది. మస్‌వరె (74) టాప్ స్కోరర్. ఓపెనర్ గుంబీ 49 పరుగులు చేశాడు. బౌలర్లలో బ్యారీ, ఆండీ తలో మూడు వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం ఐర్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేసింది. ఓపెనర్ మూర్ (79) రాణించారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు ఎక్స్‌ట్రాలు 59. జింబాబ్వే వికెట్ కీపర్ క్లైవ్ మదండే 42 పరుగులు బైస్ రూపంలోనే ఇచ్చాడు. ముజరబాని, చివంగా చెరో మూడు వికెట్లు తీశారు. కాగా, 40 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 197 పరుగులకు ఆలౌటైంది.

డియోన్ మైయర్స్ (57) అర్ధశతకం సాధించాడు. ఆండీ మెక్‌బ్రైన్ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం 158 పరుగుల ఛేదనకు దిగిన ఐర్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. టకర్ (56), మెక్‌బ్రైన్ (55*) హాఫ్ సెంచరీలతో విజయంలో కీలకపాత్ర పోషించారు. రిచర్డ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.అయితే ఐర్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
18వ ఓవర్‌లో రిచర్డ్ వేసిన బంతిని మెక్‌బ్రైన్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా షాట్ ఆడాడు. అయితే ఫీల్డర్ చటారా దాన్ని ఆపాలని విపరీతంగా ప్రయత్నించాడు. రోప్‌కు కొద్ది దూరంలో బంతిని ఆపాడు. అనంతరం అదుపుతప్పి బౌండరీ లైన్ అవతలకు వెళ్లిపోయాడు. అతను తిరిగొచ్చి బంతిని త్రో విసిరిలోపే ఐర్లాండ్ బ్యాటర్లు అయిదు పరుగులు తీసేశారు. బౌండరీ వదిలినా ఐర్లాండ్‌కు నాలుగు పరుగులే వచ్చేవి. కానీ చటారా చేసిన పనికి జింబాబ్వేకే నష్టం వాటిల్లింది. దీంతో క్రికెట్ చరిత్రలో ఇదే చెత్త ఫీల్డింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.