
హరారె: క్రికెట్ ఆటలో స్లెడ్జింగ్, గొడవలు, వివాదాలు సహజమే. అవి మితిమీరనంతవరకు బాగానే ఉంటుంది. అయితే ఒక్కోసారి ప్లేయర్స్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. తాజాగా అలాంటి ఘటనే హరారె వేదికగా జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తస్కిన్ అహ్మద్ పిచ్‌పైనే ఓ డ్యాన్స్ స్టెప్ వేయడం జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానికి అసలు నచ్చలేదు. అంతకుముందు నుంచే బంగ్లా బ్యాట్స్‌మన్‌పై కాస్త కోపంగా ఉండడంతో ముజరబానికి చిర్రెత్తుకొచ్చింది. విషయంలోకి వెళితే...
ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ తర్వగానే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ మొమినల్ హక్ (70: 92 బంతుల్లో 13x4) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతడికి లిటన్ దాస్ (95; 147 బంతుల్లో 13x4) సహరించాడు. మొమినల్ పెవిలియన్ చేరిన అనంతరం దాస్, మహ్మదుల్లా (150 నాటౌట్: 278 బంతుల్లో 17x4, 1x6) మరో విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. 132 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా.. ఈ జోడి పరుగులు చేయడంతో బంగ్లా జట్టు గాడిలో పడింది. అయితే 270 పరుగుల వద్ద దాస్, మెహదీ హాసన్ (0) వరుసగా ఔట్ అయ్యారు.
ఈ సమయంలో తస్కిన్ అహ్మద్ (75: 134 బంతుల్లో 11x4)తో కలిసి అసాధారణరీతిలో పోరాడిన మహ్మదుల్లా భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. తస్కిన్ అహ్మద్ అద్భుతంగా రాణించడంతో మహ్మదుల్లా కూడా స్వేచ్ఛగా బ్యాట్ జిలిపించాడు. 10వ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి వచ్చిన తస్కిన్.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తరహాలో ఆడాడు. బౌన్సర్, షార్ట్ పిచ్ బంతులను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో 9వ వికెట్‌కి 191 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. ఇది తట్టుకోని జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబాని.. తస్కిన్ అహ్మద్‌ని స్లెడ్జింగ్ చేయడం ద్వారా ఔట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముజరబాణి తన నోటికి పని చెప్పగా.. తస్కిన్ కూడా అదేరీతిలో బదులిచ్చాడు.
బ్లెస్సింగ్ ముజరబాణి విసిరిన ఓ షార్ట్ పిచ్ బంతిని ఆడకుండా వదిలేసిన తస్కిన్ అహ్మద్.. బంతి వెళ్లిన తీరుని యాక్షన్‌తో చూపించాడు. పిచ్‌పైనే డ్యాన్స్ చేసిన విధానం ముజరబానికి నచ్చలేదు. వెంటనే తస్కిన్ వద్దకి వెళ్లి నోటికి పనిచెప్పగా.. అతను కూడా బౌలర్ కళ్లలోకి చూస్తూ బదులిచ్చాడు. ఇద్దరూ ఒకరి ముఖంలో మరొకరు కోపంగా చూసుకున్నారు. ఇద్దరి మధ్య హెల్మెట్ మాత్రమే అడ్డుగా ఉంది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.