స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న అయిదు టీ20ల సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసే దిశగా బంగ్లాదేశ్ దూసుకెళ్తోంది. ఢాకా వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో బంగ్లాదేశ్ అయిదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. తాంజిద్ హసన్ (52; 37 బంతుల్లో, 7x4, 1x6), సౌమ్య సర్కార్ (41; 34 బంతుల్లో, 3x4, 2x6) రాణించారు. తౌహిద్ (12) మినహా మిగిలిన వాళ్లు రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. జింబాబ్వే బౌలర్లలో జాంగ్వీ మూడు వికెట్లు, నగరవ, బెనెట్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది.

ఆఖరి ఓవర్‌లో జింబాబ్వే ప్లేయర్లు చెత్త ఫీల్డింగ్ చేశారు. గల్లీ క్రికెట్ స్థాయి ఫీల్డింగ్ చేసినా బంగ్లానే 139 పరుగులకే ఆలౌట్ చేసేవారు. కానీ రనౌట్ చేసే సులువైన అవకాశాన్ని నేలపాలు చేశారు. అసలేం జరిగిందంటే.. ముజారబని వేసిన 20వ ఓవర్ రెండో బంతిని బంగ్లా బ్యాటర్ తన్వీర్ ఇస్లామ్ ఢిఫెండ్ చేసి సింగిల్‌కు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న బౌలర్ వికెట్లకు త్రో విసిరాడు. వికెట్లకు నేరుగా తగిలితే ముస్తాఫిజుర్ రనౌటయ్యేవాడు. కానీ బ్యాకప్ ఫీల్డర్ లేకపోవడంతో బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది.
ఈ లోపు బంగ్లా బ్యాటర్లు రెండో పరుగు కోసం ప్రయత్నించారు. బంతిని అందుకున్న జింబాబ్వే ఫీల్డర్ నాన్‌స్ట్రైకర్ వైపు త్రో విసిరాడు. రనౌట్ అవ్వడం పక్కా అని ముందే ఫిక్స్ అయిన ముస్తాఫిజుర్ నెమ్మదిగా క్రీజు వైపు కదిలాడు. కానీ త్రోను అందుకున్న ఫీల్డర్ క్యాంప్‌బెల్ రనౌట్ చెయ్యడంలో దారుణంగా విఫలమయ్యాడు.
బంతిని అందుకోవడంలో తడబడిన బెల్, మీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్న స్టంప్స్‌కు కూడా గురిపెట్టలేకపోయాడు. ఈ చెత్త ఫీల్డింగ్‌ను చూసి జింబాబ్వే జట్టు ఆటగాళ్లే ఆశ్చరపోయారు. అనంతరం ఛేదనలో జింబాబ్వే 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. క్యాంప్‌బెల్ (31; 27 బంతుల్లో, 1x4, 2x6) టాప్ స్కోరర్. షకిబ్ అల్ హససన్ మూడు వికెట్లు పడగొట్టాడు.