ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో జింబాబ్వే వికెట్ కీపర్ క్లైవ్ మదండే కోరుకోని రికార్డు సాధించాడు. అరంగేట్ర టెస్టులోనే క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఓ ఇన్నింగ్స్‌లో బైస్ రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. 24 ఏళ్ల క్లైవ్ మదండే పేలవమైన వికెట్ కీపింగ్ చేశాడు.
మదండే పేలవ వికెట్ కీపింగ్‌తో పాటు బౌలర్ల అనూహ్య స్వింగ్ కూడా తోడవ్వడంతో జింబాబ్వే భారీగా అదనపు పరుగులు సమర్పించుకుంది. మొత్తంగా ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 59 పరుగులు ఎక్స్‌ట్రాలుగా ఇవ్వగా, అందులో 42 పరుగులు బైస్ రూపంలోనే వచ్చాయి. దీంతో 90 ఏళ్ల చెత్త రికార్డు బద్దలైంది.

అంతకుముందు అత్యధికంగా బైస్ ఇచ్చిన వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు లెస్ అమెస్ పేరిట రికార్డు ఉండేది. 1934లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగులు బైస్‌గా ఇచ్చాడు. ఇప్పుడు ఈ రికార్డును క్లైవ్ మదండే బ్రేక్ చేశాడు. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరుల్లో రెండో అత్యధికం ఎక్సట్రాలే కావడం గమనార్హం.
మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 71.3 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. మస్‌వరె (74) టాప్ స్కోరర్. ఓపెనర్ గుంబీ 49 పరుగులు, సీన్ విలియమ్స్ 35 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ మదండే గోల్డెన్ డకౌటయ్యాడు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ, ఆండీ తలో మూడు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఐర్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేసింది.
ఓపెనర్ మూర్ (79) రాణించారు. అయితే ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు ఎక్స్‌ట్రాలు 59నే. ఆ తర్వాత అత్యధిక స్కోరుగా ఆండి సాధించిన 28 పరుగులే. దీంతో ఐర్లాండ్ 40 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మదండే మెరుగైన వికెట్ కీపింగ్ చేసి ఉంటే జింబాబ్వేకే ఆధిక్యం దక్కేది. కాగా, రెండో రోజు ఆటముగిసేసరికి జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. 28 పరుగుల వెనుకంజలో ఉంది.