హరారే వేదికగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20లో జింబాబ్వే ఆఖరి బంతికి విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలిచి మూడు టీ20ల సిరీస్‌లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 144 పరుగులు చేసింది. కరీమ్ జనత్ (54; 49 బంతుల్లో, 5 ఫోర్లు), మహ్మద్ నబీ (44; 27 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు.
జింబాబ్వే బౌలర్లలో నగరవ (3/28) మూడు వికెట్లు తీశాడు. ముజారబాని (1/26), ట్రెవోర్ గ్వాండు (1/35), వెల్లింగ్టన్ మస్కడ్జా (1/18) తలో వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ 58 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఖాతా తెరవకముందే ఓపెనర్ గుర్బాజ్ పెవిలియన్‌కు చేరాడు. 0/1, 24/2, 25/3, 33/4, 58/5.. ఇలా వరుసగా అఫ్గాన్ వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్ నబీతో కలిసి కరీమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం ఛేదనకు దిగిన జింబాబ్వే సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49; 49 బంతుల్లో, 5 ఫోర్లు), డియోన్ మైయేర్స్ (32; 29 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఛేదనలో కీలక పాత్ర పోషించారు. అయితే జింబాబ్వే ఛేదన అంత సాఫీగా సాగలేదు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 21 పరుగులు అవసరం. అయితే 19వ ఓవర్ వేసిన నవీనుల్ హక్ 10 పరుగులచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు.
దీంతో విజయ సమీకరణం ఆరు బంతుల్లో 11 పరుగులుగా మారింది. ఆఖరి ఓవర్‌ను అజ్మతుల్లా వేయగా తొలి బంతిని తషింగ ముసేక్వా (16 నాటౌట్; 13 బంతుల్లో, 1 ఫోర్) బౌండరీ బాదాడు. తర్వాతి రెండు బంతులకే రెండేసి చొప్పున డబుల్స్ సాధించాడు.కానీ నాలుగో బంతికి అజ్మతుల్లా పరుగులేమి ఇవ్వలేదు. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరమవ్వగా.. అయిదో బంతిని తషింగ రెండు పరుగులు సాధించాడు. చివరి బంతికి సింగిల్ తీసి జట్టును గెలిపించాడు.