
జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ విజయం సాధించింది. జింబాబ్వే 40.3ఓవర్లకు 189పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత ధావన్ (81పరుగులు), శుభ్‌మన్ గిల్ (82పరుగులు) ఇద్దరే 30.5ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేశారు. తద్వారా 10వికెట్ల భారీ తేడాతో ఇండియా సునాయసంగా గెలుపొందింది. ఇక కేఎల్ రాహుల్ సారథ్యంలో తొలిసారి భారత్ వన్డే మ్యాచ్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ తన అభిప్రాయాలను వెల్లడించాడు.
తాము మంచి ప్రయత్నమే చేసినప్పటికీ.. కొన్ని విషయాలు తమకు అనుకూలంగా జరగలేవని పేర్కొన్నాడు. రెండో మ్యాచ్‌లో తప్పకుండా పుంజుకుంటామని చెప్పాడు.జింబాబ్వే కెప్టెన్ చకబ్వా మాట్లాడుతూ.. భారత బౌలర్లు మంచిగా బౌలింగ్ చేశారు. మాపై ప్రెషర్ పెంచారు. బ్యాటింగ్లో 4, 5 ఓవర్ల తర్వాత మేము పూర్తిగా లయ కోల్పోయాం. చివర్లో రిచి ఎంగరవ, బ్రాడ్ ఈవన్స్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడం మంచిదైంది.
కానీ ఏదేమైనా మేము ఒకట్రెండు భారీ భాగస్వామ్యాలను నెలకొల్పాల్సింది. కానీ అది మిస్సయింది. ఒకవేళ అదే జరిగితే మ్యాచ్ మరోలా ఉండేది. ఇక మా బౌలర్లు ఓపెనర్లను ఔట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఒకట్రెండు వికెట్లు పడుంటే కాస్త మ్యాచ్ మా వైపు తిరిగే అవకాశముండేది. కానీ ఓపెనర్లిద్దరు ధావన్, గిల్ ఘోరంగా ఆడి మ్యాచ్‌ను మా నుంచి దూరం చేశారు.
మేము ఈ రోజు ఎలా ఓడామో దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. వచ్చే మ్యాచ్‌లో మళ్లీ పునరుత్తేజంతో బరిలోకి దిగుతాం. శనివారం నాటి మ్యాచ్‌లో మేమేంటో చూపిస్తాం. అని చకబ్వా పేర్కొన్నాడు.
తొలి వన్డేలో ఆడిన జింబాబ్వే జట్టు : మరుమణి, ఇన్నోసెంట్ కాయ, సీన్ విలియమ్స్, వెస్లీ మధేవెరే, సికందర్ రజా, చకాబ్వా (కెప్టెన్, వికెట్ కీపర్), ర్యాన్ బర్ల్, లూక్ జాంగ్‌వి, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ ఎన్‌యౌచి, రిచార్డ్ ఎంగర్వా