T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‍లో సంచలనం సృష్టించిన జింబాబ్వే.. ఒక్క పరుగు తేడాతో పాక్‍పై గెలుపు..

టీ20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా పెర్త్ లో జరిగిన సూపర్ 12 మ్యాచ్ లో పాకిస్థాన్ పై జింబాబ్వే ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులుచేసింది. ఓపెనర్లు కాస్త ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వచ్చిన వారు త్వరగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ మాధేవేరే 17 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ క్రెయిగ్ ఎర్విన్ 19 పరుగులు చేశాడు. సీన్ విలియమ్స్ 28 బంతుల్లో 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో బ్రాడ్ ఎవాన్స్ 19 పరుగులు చేయడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.
పాక్ ఓపెనర్లు
ఇక పాక్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్ 4 ఓవర్లు వేసి 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. షాదబ్ ఖాన్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. హరిస్ రవుఫ్ ఒక వికెట్ పడగొట్టాడు. 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది.పాక్ కెప్టెన్ బాబర్ అజాం 4 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 14 పరుగులకు పెవిలియన్ చేరాడు.
షాన్ మసూద్
ఇఫ్తికార్ అహ్మద్ కూడా 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో పాక్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న జట్టును షాన్ మసూద్, షదాబ్ ఖాన్ ఆదుకున్నారు. 17 పరుగులు చేసిన షదాబ్ ఖాన్ రజా బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన హైదర్ అలీ డకౌట్ అయ్యాడు. 38 బంతుల్లో 3 ఫోర్లతో 44 పరుగులు చేసిన షాన్ మసూద్ రజా బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చన మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్ జట్టును గెలిపించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు.
చివరి బంతికి మూడు పరుగులు
18 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో 22 చేసిన నవాజ్ ఔటయ్యాడు. దీంతో చివరి బంతికి పాక్ మూడు పరుగులు చేయాల్సి వచ్చింది. షాహీన్ షా అఫ్రిదీ రెండో రన్ కు ట్రై చేసి రనౌటయ్యాడు. దీంతో జింబాబ్వే విజయం సాధించింది. సికిందర్ రజా 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ ఎవాన్స్ 2 వికెట్లు తీయగా.. ల్యూక్ జోంగ్వే, ముజారబానీని ఒక్కో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications