రాయ్‌పూర్: ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లు జహీర్ ఖాన్, మోర్కెల్ బౌలింగ్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ తల వంచింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగుతో ఢిల్లీ చెన్నైపై విజయం సాధించింది. బౌలింగ్‌లో జహీర్ ఖాన్ (2/9), మోర్కెల్ (2/21), బ్యాటింగ్‌లో శ్రేయాస్ (49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 70 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించడంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో చెన్నైపై ఆడుతూ పాడుతూ గెలిచింది.
మంగళవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. డుప్లెసిస్ (29), ధోనీ (27) టాప్ స్కోరర్లు. అనంతరం ఢిల్లీ 16.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జహీర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.

లక్ష్యం స్వల్పం కావడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు విజయం సాధించడం సులభమైంది. అయితే ఆరంభంలోనే ఓపెనర్ డికాక్ (3), కెప్టెన్ డుమినీ (6)ను ఈశ్వర్ పాండే అవుట్ చేశాడు. ఈ దశలో యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్-యువీ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. తొలి ఓవర్ నుంచే శ్రేయాస్ భారీ షాట్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పాండే వేసిన 7వ ఓవర్‌లో అయ్యర్ సిక్సర్, ఫోర్ బాదగా.. యువీ రెండు బంతుల్ని బౌండరీకి తరలించాడు.
పేలవంగా ఉన్న చెన్నై బౌలింగును ఉతికి ఆరేస్తూ శ్రేయాస్ 36 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. చివరికి యువరాజ్ సింగ్ (32)ను నేగి అవుట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు శ్రేయాస్-యువీ 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నేగి వేసిన 16వ ఓవర్‌లో అయ్యర్ రెండు బౌండరీలు సాధించగా, మోర్కెల్ సిక్సర్ బాదాడు. తర్వాతి ఓవర్‌లో శ్రేయాస్ ఫోర్‌తో విన్నింగ్ షాట్ కొట్టాడు.
అనూహ్యమైన రీతిలో అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌లో డీలా పడింది. ఢిల్లీ పేసర్లు జహీర్ ఖాన్, మోర్కెల్ విజృంభణతో పటిష్ట బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. టాపార్డర్‌లో ఒక్కరూ మెరుగ్గా ఆడలేకపోయారు. కెప్టెన్ ధోనీ, డుప్లెసిస్ మాత్రమే పోరాడే ప్రయత్నం చేశారు. ఢిల్లీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఐదో ఓవర్‌లో ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (11)ను జహీర్ తొలి వికెట్‌గా అవుట్ చేశాడు.
మెకల్లమ్ భారీ షాట్‌కు ప్రయత్నించగా మిడాఫ్‌లో డుమినీకి దొరికిపోయాడు. తర్వాత స్మిత్ (18) సిక్సర్, ఫోర్ బాది ధాటిగా ఆడడానికి ప్రయత్నించి 9వ ఓవర్‌లో మోర్కెల్ బౌలింగులో అవుటయ్యాడు. పొట్టి క్రికెట్ స్పెషలిస్టు సురేష్ రైనా (11) కూడా నిరాశపర్చాడు.
చెన్నై స్కోరు 10 ఓవర్లలో 43 మాత్రమే. ఈ దశలో ధోనీ-డుప్లెసిస్ ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 37 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. చివరికి ఈ జోడీని మోర్కెల్ విడదీశాడు. 16వ ఓవర్‌లో డుప్లెసిస్‌ని మోర్కెల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత ధోనీతో బ్రావో జతకలిశాడు.
యువీ వేసిన 17వ ఓవర్‌లో ధోనీ 6, 4 బాదాడు. ఆ తర్వాత సంధూ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన బ్రావో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. అదే ఓవర్‌లో ధోనీ ఫోర్ సాధించాడు. తర్వాత ధోనీని జహీర్ వెనక్కి పంపాడు. చివరి ఓవర్‌లో చెన్నై 5 పరుగులే చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ను ఢిల్లీ బౌలర్లు ఇంతగా కట్టడి చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.