మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్లను బలోపేతం చేసుకునే ప్రణాళికల్లో ఫ్రాంచైజీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ఆక్షన్‌లో ఎలాంటి ఆటగాళ్లను సొంతం చేసుకోవాలో ఓ అంచనాకు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను మెంటార్‌గా నియమించాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తోంది. జహీర్ నియమాకం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ పేసర్‌తో ఫ్రాంచైజీ చర్చలు కూడా జరిపిందని సమాచారం. జహీర్‌కు బౌలింగ్ కోచ్‌గా అదనపు బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

గతంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఐపీఎల్-2024 సీజన్ ముందు కేకేఆర్‌కు గంభీర్ ఆ సేవలు అందించాడు. ఆ తర్వాత భారత జట్టు కోచ్‌గా గంభీర్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే గంభీర్ మెంటార్‌గా ఉన్న సమయంలో లక్నో రెండు సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇక మెంటార్ పాత్ర పోషించడం జహీర్ ఖాన్‌కు ఇదే ప్రథమం.
2018 నుంచి 2022 వరకు జహీర్ ముంబై ఇండియన్స్‌కు సహాయక సిబ్బందిగా పనిచేశాడు. తొలుత డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, ఆ తర్వాత హెడ్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ప్లేయర్‌గా ముంబైతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం పేసర్ 102 వికెట్లు పడగొట్టాడు.
జహీర్ ఖాన్‌నే ఎందుకు?
ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కోచ్‌గా జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్‌లుగా ఆడమ్ వోగ్స్, లాన్స్ క్లూసెనర్, జాంటీ రోడ్స్ ఉన్నారు. అయితే బౌలింగ్ కోచ్‌గా ఉన్న మోర్నే మోర్కల్ భారత జట్టు కోచ్ బృందంలో చేరనున్నాడు. దీంతో ఆ స్థానాన్ని కూడా భర్తీ చేస్తూ జహీర్ మెంటార్ బాధ్యతలను సమర్థవంతం నిర్వహిస్తాడని లక్నో ఫ్రాంచైజీ భావిస్తోంది. కాగా, 45 ఏళ్ల జహీర్‌ఖాన్ టీమిండియా తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్ టీమిండియా గెలవడంలో ఈ ఎడమచేతి వాటం పేసర్ కీలక పాత్ర పోషించాడు.