మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుండటంతో ఫ్రాంచైజీల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా మెగా ఆక్షన్‌కు ముందు రిటైన్డ్ ప్లేయర్ల గురించి చర్చ లోతుగా సాగుతుంటుంది. ఏ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటారనే ఉత్కంఠ ఉంటుంది. కానీ ఈసారి భిన్నంగా కోచింగ్ స్టాఫ్‌పై సర్వత్రా ఆసక్తి పెరిగింది.
మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు సహాయక సిబ్బంది విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జట్టును బలోపేతం చేయడంలో మెగా ఆక్షన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో వేలానికి ముందే అనుభవజ్ఞులను తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను తమ ఫ్రాంచైజీలోకి లక్నో సూపర్ జెయింట్స్ ఆహ్వానించనున్నట్లు సమాచారం. జహీర్‌కు మెంటార్‌గా బాధ్యతలు అందివ్వనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ఎంపిక అవుతాడని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. జహీర్ ఎంపికకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు కూడా తెలిసింది.
కానీ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ జహీర్‌కు బదులుగా మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు గంభీర్-మోర్కెల్ కలిసి పనిచేశారు. అయితే గంభీర్ రిజెక్ట్ చేసిన జహీర్‌కు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌తో పాటు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు అందివ్వాలని ప్లాన్ చేస్తోంది.మయాంక్ యాదవ్ వంటి యువ పేసర్లు లక్నో జట్టులో ఉన్నారు. జహీర్ రాకతో యువ బౌలర్లు మరింత మెరుగవుతారని లక్నో ఫ్రాంచైజీ భావిస్తోంది.
ప్రస్తుతం లక్నో ప్రధాన కోచ్‌గా జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్‌లుగా ఆడమ్ వోగ్స్, లాన్స్ క్లూసెనర్, జాంటీ రోడ్స్ ఉన్నారు. కాగా, 45 ఏళ్ల జహీర్‌ఖాన్ టీమిండియా తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్ టీమిండియా గెలవడంలో ఈ ఎడమచేతి వాటం పేసర్ కీలక పాత్ర పోషించాడు.