ఐపీఎల్ 2021 వాయిదా పడకపోతే.. నేనే వెళ్లిపోయేవాడిని: టీమిండియా బౌలర్

బెంగళూరు: ఒక వేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 నిరవధిక వాయిదా పడకపోతే.. తాను లీగ్ నుంచి వెళ్లిపోయేవాడినని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తెలిపాడు. తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆటపై శ్రద్ధ పెట్టలేకపోయానన్నాడు. వీలైనంత తొందరగా ఇంటికి వెళ్లిపోవాలనుకున్నానని చహల్ చెప్పాడు. మే 4న పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 వాయిదాకు ముందే కొందరు ఆటగాళ్లు లీగ్ నుంచి వెళ్లిపోయారు.

విరామం తీసుకోవాలనుకున్నా:
ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుజ్వేంద్ర చహల్ మాట్లాడుతూ... 'నా తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకిందని తెలియగానే.. ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నా. ఇంటి దగ్గర వాళ్లు ఒంటరిగా ఉన్న సమయంలో ఇలా జరిగితే.. ఆటపై దృష్టి సారించడం చాలా కష్టమవుతుంది. మే 3న నా తల్లిదండ్రులకు పాజిటివ్ అని నిర్ధరణ అయింది. కాస్త ఆందోళనకు గురయ్యా. ఆ సమయంలో ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆ మరుసటి రోజే ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది' అని అన్నాడు.

ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి:
'నా తండ్రి ఆక్సిజన్ లెవెల్స్ 85-86కి పడిపోయాయి. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. నిన్ననే అక్కడి నుంచి తీసుకొచ్చాం. అయినప్పటికీ అతనికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఏదేమైనా నాన్న ఆక్సిజన్ లెవెల్స్ 95-96కి చేరుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఇది మా కుటుంబంలో కొంత ఉపశమనం ఇచ్చింది. నాన్న మెరుగవ్వడానికి ఇంకో 7-10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. నాన్న త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని వేడుకుంటున్నా' అని యుజ్వేంద్ర చహల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్.. చహల్‌కు ఆర్‌సీబీ తరఫున 100వ ఐపీఎల్ మ్యాచ్. 2013లో ముంబై ఇండియన్స్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన యూజీ.. ఆ మరుసటి ఏడాదే ఆర్‌సీబీలో చేరాడు.

ముందే హింట్ వచ్చింది:
ఐపీఎల్ బయో బబుల్‌లోని కొంతమంది ఆటగాళ్లకు వైరస్ సోకగానే.. టోర్నమెంట్ వాయిదా పడుతుందని మాకు హింట్ వచ్చిందని బెంగళూరు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తెలిపాడు. ఐపీఎల్ వాయిదా పడిన నేపథ్యంలో లీగ్ నిర్వహణకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అని చహల్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్‌లో మిగిలిన లీగ్‌ను జరపాలని బీసీసీఐ కూడా భావిస్తోన్నట్లు పేర్కొన్నాడు. భారత్ నుంచి ఆతిథ్య వేదిక యూఏఈకి తరలిపోయినా.. టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా భారత్‌కు ఉందని చహల్ ధీమా వ్యక్తం చేశాడు.

కోల్‌కతా బౌలర్లకు పాసిటివ్:
మొదటగా కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు పాజిటీవ్ రాగా.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, హైదరాబాద్ సీనియర్ కీపర్ వృద్దిమాన్ సాహా, చెన్నై కోచ్‌లు లక్ష్మీపతి బాలాజీ, మైఖేల్ హస్సిలు మహమ్మారి బారిన పడ్డారు. దాంతో ఆటగాళ్ల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. మిగిలిన సీజన్ కోసం సరైన సమయం, వేదిక కోసం బీసీసీఐ చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications