
18 పరుగులు.. 3 వికెట్లు
కీలక సమయంలో మూడు వికెట్లు తీసిన యుజువేంద్ర చహల్ బెంగళూరు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి.. కీలకమైన 3 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. జానీ బెయిర్‌స్టో, విజయ్ శంకర్, మనీశ్ పాండేల వికెట్లు తీసాడు. అయితే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ ఏబీ డివిలియర్స్ సలహాతోనే తాను అద్భుత ప్రదర్శన చేయగలిగానని యూజీ అన్నాడు. వారి సూచనలతోనే కీలక విజయ్ శంకర్‌ను ఔట్ చేశానని చెప్పాడు. శంకర్‌ను పెవిలియన్ పంపించేందుకు గూగ్లీని విసరాలని సలహా ఇచ్చారన్నాడు.

బెయిర్‌స్టోకు లెంగ్త్‌తో బంతులు వేశా
మ్యాచ్ అనంతరం యుజువేంద్ర చహల్ మాట్లాడుతూ... 'తొలి ఓవర్ వేసినప్పుడే లైన్, లెంగ్త్ తప్పకుండా బంతులు వేయాలని అర్థం చేసుకున్నా. ఒక సమయంలో హైదరాబాద్ అద్భుతంగా ఆడింది. దాంతో వికెట్‌కు దూరంగా బంతులు విసిరి ఒత్తిడి పెంచా. మనీష్ పాండేకు బౌలింగ్ చేసేటప్పుడు ఆఫ్ స్టంప్‌కు దూరంగా బంతులు వేయాలని అనుకున్నా. లెగ్‌సైడ్ ఆడటం కష్టం కావడంతో.. స్టంప్స్‌కే విసిరా. తిరిగే బంతుల్ని ఆడటం కష్టం కాబట్టి బెయిర్‌స్టోకు లెగ్‌లో దూరంగా కాస్త ఫుల్ లెంగ్త్‌తో బంతులు వేశా' అని తెలిపాడు.

చేతులకు మట్టి రాసుకున్నా
'జానీ బెయిర్‌స్టో పెవిలియన్ చేరిన అనంతరం విజయ్ శంకర్ క్రీజులోకి రాగానే.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నా వద్దకొచ్చి గూగ్లీ వేయాలని చెప్పారు. ఆ సలహా పనిచేసింది. అయితే తేమతో బంతి జారకుండా ఉండేందుకు నా చేతులకు మట్టి రాసుకున్నా. దీంతో నేను అనుకున్న విధంగా బంతిని వేసా. విజయ్ బోల్డ్ అయ్యాడు' అని యుజువేంద్ర చహల్ పేర్కొన్నాడు. వరుస వికెట్లు తీసేందుకు కోహ్లీ, ఏబీ తనకు సలహాలు ఇచ్చారని యూజీ చెప్పాడు.

వరుస బంతుల్లో బెయిర్‌స్టో, శంకర్ ఔట్
164 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ తొలుత అదరగొట్టింది. డేవిడ్ వార్నర్ (6) రనౌట్ అయినా.. బెయిర్‌స్టో (61; 43 బంతుల్లో 6×4, 2×6)), మనీశ్ పాండే (34; 33 బంతుల్లో 3×4, 1×6) ఆదుకోవడంలో 15 ఓవర్లకు 121/2తో నిలిచింది. ఇదే సమయంలో చహల్ విజృంభించాడు. ఊహించని రీతిలో వరుస బంతుల్లో బెయిర్‌స్టో, విజయ్ శంకర్‌ను ఔట్ చేశాడు. అంతకు ముందే మనీశ్‌నూ పెవిలియన్ చేర్చాడు. దాంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. చివరి ఐదు ఓవర్లలో విజయానికి 43 పరుగులు చేయాల్సిన క్రమంలో హైదరాబాద్ తడబడింది. 32 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను చేజార్చుకుంది.


Click it and Unblock the Notifications
