భారత్‌లో క్రికెట్ పిచ్చి ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సిటీలో ఏ గల్లీలోకి వెళ్లినా అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. అప్పుడప్పుడు టీమిండియా స్టార్లు కూడా వారితో కలిసి ఆడుతూ ఆనందాన్ని పంచుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ జాబితాలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చేరాడు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత చాహల్‌కు కొంత గ్యాప్ దక్కింది. డబ్ల్యూటీసీ ఆడే జట్టులో అతను లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయినట్లున్నాడీ లెగ్ స్పిన్నర్. ఈ క్రమంలోనే రోడ్డుపై పిల్లలు క్రికెట్ ఆడుతుంటే తను కూడా వారితో చేరిపోయాడు. ఈ గల్లీ మ్యాచ్‌లో డిఫెన్స్ ఆడుతూ కనిపించాడీ స్టార్ స్పిన్నర్.

దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న చాహల్.. 'ది గల్లీ ఇంపాక్ట్ ప్లేయర్.. ఏమంటావ్ రాజస్థాన్ రాయల్స్?' అంటూ తన ఐపీఎల్ టీంను ప్రశ్నించాడు. సాధారణంగా రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అడ్మిన్ ఎక్కువగా సరదా ట్వీట్లు చేస్తూ ఉంటాడు. దీంతో అందరూ ఈ అడ్మిన్‌త నెట్టింట జోకులు వేస్తుంటారు. ఈ క్రమంలోనే చాహల్ కూడా ఈ క్వశ్చన్ వేశాడు.
అయితే ఈ వీడియోపై ఎవరూ ఊహించని విధంగా ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పందించాడు. చాహల్ డిఫెన్స్ షాట్లు ఆడటాన్ని ఎగతాళి చేసిన రషీద్ ఖాన్.. 'కనీసం ఇక్కడైనా సిక్సర్ కొట్టు భాయ్' అని రిప్లై ఇచ్చాడు. దీనిపై చాహల్ రియాక్షన్ కూడా తెగ వైరల్ అవుతోంది. 'ఇక్కడ సిక్స్ కొడితే అవుట్ అంట ఖాన్ గారూ' అని చాహల్ వెల్లడించాడు.
గల్లీ క్రికెట్‌లో వింత వింత రూల్స్‌తో బ్యాటర్‌ను రిస్ట్రిక్ట్ చేస్తారనే విషయం ఈ ఆట ఆడే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. 'వన్ స్టెప్ క్యాచ్', 'నో సిక్స్' వంటివి అలాంటి రూల్సే. అలాగే చాహల్ ఆడిన చోట బంతి గాల్లోకి లేపితే అవుట్ అన్నమాట. ఇప్పుడు ఇలా చాహల్ ఇచ్చిన రిప్లై చూసిన ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా చాహల్ చక్కగా రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గతేడాది ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న అతను.. ఈ ఏడాది 8.18 ఎకానమీతో 21 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓవరాల్‌గా 183 వికెట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో రికార్డును కూడా బద్దలు కొట్టాడు.