గత కొన్ని రోజులుగా వార్తల్లో తెగ చర్చనీయాంశమవుతోన్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రీసెంట్ గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో (రూమర్) కలిసి మైదానంలో సందడి చేసిన అతడు.. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తాజాగా.. తనకు సవాల్ విసిరే బ్యాటర్లు ఎవరో పేర్లు తెలిపాడు. వారిలో కోహ్లీ, రోహిత్ లేకపోవడం గమనార్హం.
చాహల్.. ఈసారి పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2025 బరిలోకి దిగబోతున్నాడు. రూ.18 కోట్లు పెట్టి మరీ అతడని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే తాజాగా ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న చాహల్.. సన్ రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్ బలమైన బ్యాటర్లు అని చెప్పాడు. వారు భారీ సిక్స్ లు బాదుతారని పేర్కొన్నాడు.

"నాకు టఫెస్ట్ బ్యాటర్లు ఇద్దరు. ఒకరు హెన్రిచ్ క్లెసెన్. ఇంకొకడు నికోలస్ పూరన్. వాళ్లకు చాలా శక్తి ఉంది. బంతులను బలంగా బాదుతారు. ఎడ్జెస్ లోనూ సిక్స్ లు బాదుతారు. వాళ్లకు బౌలింగ్ వేయడం సవాల్ గా ఉంటుంది. అలానే వాళ్లపై నేను కూడా సిక్స్ లు బాదాను. బానే రాణించాను. అయితే నేను బౌలింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి ఫేమ్ చూడను. స్టార్ బ్యాటర్లా లేదా చిన్న బ్యాటర్లా అనేది చూడను. ఎందుకంటే వాళ్ల ఫేమ్ చూస్తే మనపై ఒత్తిడి పెరుగుతుంది. నా దగ్గర బంతి ఉంది, వాళ్ల దగ్గర బ్యాట్ ఉంది అంతే. నేను యుద్ధంలో గెలవాలి అంతే. నేను 6.5 అడుగుల ఎత్తు ఉండకపోవచ్చు. వెడల్పైన ఛాతీ లేకపోవచ్చు. నా మెదడే నా బలం. నేను దానిపైనే మాత్రం ఫోకస్ చేస్తాను." అని చెప్పుకొచ్చాడు. అలానే ఈ ఐపీఎల్ కొత్త సీజన్‌లో కొత్త అవతారం ఎత్తేందుకు తాను సిద్ధమంటూ చాహల్ ఇటీవలే ఓ వీడియోలో చెప్పాడు. అవకాశం ఇస్తే ఓపెనర్ గా రాణిస్తానని అన్నాడు.
పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ ను మార్చి 25న అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.