
హైదరాబాద్: టీమిండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ను బీసీసీఐ సెలక్టర్లు భారత్-ఏ జట్టుకు ఎంపిక చేశారు. ఆగస్టు 4 నుంచి దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌లలో అతడు ఆడనున్నాడు. చాహల్, కుల్‌దీప్ ద్వయాన్ని టెస్టుల్లో ఆడించాలని అనిపిస్తోందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్యనే విలేకరుల సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే.
కోహ్లీ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొనే సెలక్టర్లు చాహల్‌ను భారత్-ఏకు ఎంపిక చేసినట్టు సమాచారం. రెండేళ్లుగా టీమిండియా తరఫున ఎడతెరపి లేకుండా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్న చాహల్ రంజీ ట్రోఫీ (27 మ్యాచ్‌లు, 70 వికెట్లు) ఆడి చాన్నాళ్లు అయింది. 2016 డిసెంబర్లో హర్యానాపై చివరి సారి అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు చాహల్ అలవాటు పడాలనే ఉద్దేశంతో అతడిని భారత్-ఏకు ఎంపిక చేశారు.
ఇంగ్లాండ్‌లో భారత్-ఏ తరఫున రాణించిన ఆటగాళ్లే దక్షిణాఫ్రికా-ఏ సిరీస్‌కు ఎంపికయ్యారు. నాలుగు సిరీస్‌ల కోసం భారత్-ఏ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, భారత్-బికి మనీశ్ పాండే కెప్టెన్సీ వహిస్తారు. దులీప్ ట్రోఫీలో ఇండియా-బ్లూకు ఫయాజ్ ఫజల్, ఇండియా-రెడ్‌కు అభినవ్ ముకుంద్, ఇండియా-గ్రీన్‌కు పార్థివ్ పటేల్ నాయకత్వం వహిస్తారు.
భారత్ ఏ జట్టులో బెళగావిలో ఆగస్టు 4-7 వరకు తొలి మ్యాచ్, బెంగళూరులో ఆగస్టు 10-13 వరకు రెండో మ్యాచ్ జరుగుతుంది. చాహల్‌ను టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయించేందుకే ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులకే జట్టును ప్రకటించినట్టు తెలుస్తోంది. చాహల్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఫామ్‌లోకి వస్తే సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజాకు టీమిండియా దారులు మూసుకుపోయినట్టే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.