
ధోని జట్టులో ఉండటం అదృష్టం
ధోని జట్టులో ఉండటం అదృష్టమని చాహాల్ తెలిపాడు. తన ఎదుగుదలకు కారణం ధోనియేనని, అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తే మందలిస్తాడని చాహల్ ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు. "నా ఎదుగుదలకు ధోనీయే కారణం. పొరపాట్లు చేస్తే అప్పుడప్పుడు మందలిస్తాడు. కానీ అతనిచ్చే సలహాలు, సూచనలు చాలా బాగా పని చేస్తాయి" అని అన్నాడు.

నేనే కాదు బౌలర్లందరూ ధోని సాయం తీసుకుంటారు
"నేనే కాదు బౌలర్లందరూ ధోని సాయం తీసుకుంటారు. టీమిండియాలో అందరూ అతని సలహాలు తీసుకుంటారు. మ్యాచ్ మధ్యలో ఇబ్బంది పడుతున్నప్పుడు, సలహా అవసరమైనప్పుడు ఇప్పటికీ నేను ధోనీవైపు చూస్తాను. అతడికి అద్భుతమైన పరిశీలనా నైపుణ్యం ఉంది. బౌలర్‌కు సందేహం ఉన్నా, దేహ భాషను బట్టి ప్రశ్నలేమైనా ఉన్నాయా అని వికెట్ల వెనకాల నుంచి అడుగుతాడు" అని చాహల్ తెలిపాడు.

ఎన్నోసార్లు ధోని సలహాతో వికెట్లు తీశాను
"నాకు ఏ ఇబ్బంది తలెత్తినా వచ్చి పరిష్కరిస్తాడు. నేనెప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నా మహీ భాయ్ నావద్దకు వస్తాడు. నా దగ్గరికే కాదు ఎవరికైనా ధోని సాయం చేస్తాడు. అతడు జట్టులో ఉండటం అదృష్టం. ఎన్నోసార్లు ధోని సలహాతో వికెట్లు తీశాను. ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‌లో పవర్ ప్లేలో రోహిత్ నన్ను బౌలింగ్ చేయమన్నాడు" అని అన్నాడు.

వికెట్ టు వికెట్ బంతులు వేయమని సలహా ఇచ్చాడు
"నేను ధోనీ వైపు చూశాను. వెంటనే నా వద్దకు వచ్చి వికెట్ టు వికెట్ బంతులు వేయమని సలహా ఇచ్చాడు. నేను దాన్నే అనుకరించి ఇమామ్ ఉల్ హక్‌ను ఔట్ చేశా. కొన్నిసార్లు మేం పొరపాట్లు చేసినప్పుడు ధోనీ భాయ్ మాపై అరుస్తాడు" అని చాహల్ నవ్వుతూ చెప్పాడు. ధోని సారథ్యంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదిగారు. చాహల్ సైతం మహీ నేతృత్వంలోనే జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు.


Click it and Unblock the Notifications













