భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరోసారి సంచలనం సృష్టించాడు. తాజాగా చాహల్ పెట్టిన ఒక 'క్రిప్టిక్' ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు గురించి ప్రస్తావించాడు. ఆ తీర్పులో "ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న భార్యలు తమ భర్తల నుంచి భరణం డిమాండ్ చేయలేరు" అని ఉంది.
యుజ్వేంద్ర చాహల్ షాకింగ్ పోస్ట్
ఈ కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. యుజ్వేంద్ర చాహల్ ఈ పోస్ట్‌పై తనదైన శైలిలో కామెంట్ చేశాడు. చాహల్ "అమ్మ మీద ఒట్టు పెట్టు, ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గను" అని హిందీలో రాశారు. ఇది ధనశ్రీ వర్మను ఉద్దేశించి చేసిన వ్యంగ్యాస్త్రంగా కనిపిస్తోంది. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులు 2025 మార్చి 20న బాంబే హైకోర్టులో ఖరారు అయ్యాయి. 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట 2022 జూన్‌లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల తర్వాత యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మకు భరణంగా రూ. 4.75 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.

'Be Your Own Sugar Daddy' వివాదం
విడాకుల తుది విచారణ సందర్భంగా యుజ్వేంద్ర చాహల్ 'Be Your Own Sugar Daddy' (మీకు మీరే ఆసరాగా ఉండండి/డబ్బు సంపాదించుకోండి) అని రాసి ఉన్న టీ-షర్ట్‌ను ధరించి కోర్టుకు వచ్చారు. ఆ సమయంలో అది ఓ ప్రకటనగా పెద్ద వివాదానికి దారితీసింది. అంతే కుకుండా ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో యుజ్వేంద్ర చాహల్ తమ విడాకుల గురించి బహిరంగంగా మాట్లాడారు. తమ బంధంలో సమస్య చాలా కాలం నుంచే ఉన్నప్పటికీ.. తిరిగి రాలేని స్థితికి చేరుకునే వరకు దాన్ని దాచిపెట్టాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. అప్పటి వరకు తాము సోషల్ మీడియాలో ఒక సాధారణ జంటలా నటిస్తూ వచ్చామని ఒప్పుకున్నారు. 'వేరుగా ఉన్నప్పుడు కూడా మీ బంధాన్ని నటిస్తున్నారా?' అని అడిగినప్పుడు.. చాహల్ 'అవును' అని నిర్ధారించారు.
రిలేషన్స్ గురించి చాహల్ అభిప్రాయం
యుజ్వేంద్ర చాహల్ వివరణ ఇస్తూ.. వైవాహిక బంధం ఓ రాజీ అని.. ఒకరు కోపంగా ఉంటే మరొకరు వినాల్సి ఉంటుందని వెల్లడించారు. కొన్నిసార్లు ఇద్దరి మనస్తత్వాలు కలవకపోవచ్చని చెప్పారు. తాను భారత జట్టు తరఫున ఆడుతున్నానని.. ధనశ్రీ కూడా తన పనిలో నిమగ్నమై ఉన్నారని.. ఇదంతా ఒకటీ, రెండు సంవత్సరాల నుంచే నడుస్తోందని పేర్కొన్నారు. "ఆ సమయంలో నేను దేశానికి, వ్యక్తిగత విషయాలకు సమయం కేటాయించడంలో ఎంతగానో మునిగిపోయాను. బంధం గురించి ఆలోచించలేకపోయాను," అని యుజ్వేంద్ర చాహల్ వివరించారు.