
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరిలో జరగనున్న టీ20 సిరిస్ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోని తన ఇస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
ఈ వీడియోపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లతో పాటు దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రాజ్ షమ్సీ, వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్, భారత బౌలింగ్ కోచ్‌లు తమదైన శైలిలో స్పందించారు. 'ఓ మై గాడ్.. ఈజ్ దీస్ చాహల్ ఆర్ క్రిస్‌గేల్' అని షమ్సీ ఆ వీడియోపై కామెంట్ చేశాడు.
దీనిపై స్పందించిన చాహల్ 'నేను క్రిస్ గేల్ కన్నా ఎక్కువ బరువు ఎత్తగలను. ఇది నా వామప్ సెట్' అని సమాధానమిచ్చాడు. దీనిపై క్రిస్‌గేల్ 'నన్ను చంపేయండి' అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ' నీ శక్తికి ఆ డంబెల్స్ చాలా తక్కువ. మరిన్ని కేజీలు కలుపుకోవాలి' అని ఫీల్డింగ్ కోచ్ ట్వీట్ చేశాడు.
కాగా, ఈ ఏడాది టీ20లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో యజువేంద్ర చాహల్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున చాహల్ 13 మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది ఆర్సీబీలో అత్యధిక వికెట్లను సాధించిన రెండో ఆటగాడు చాహల్ నిలిచాడు.
ఇక, 2016 ఐపీఎల్‌లో 21 వికెట్లను తీశాడు. ఇప్పటివరకు 56 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన చాహల్ 70 వికెట్లు తీశాడు. కాగా, ఐపీఎల్ 2018లో ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌లో భాగంగా బెంగళూరు జట్టు చాహల్‌ను అట్టిపెట్టుకోలేదు. బెంగళూరు జట్టు 2018 ఐపీఎల్ కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్, సర్ఫరాజ్ ఖాన్‌లను మాత్రమే అట్టిపెట్టుకుంది.