టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులు జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఒకరోజు వ్యవధిలోనే ఈ విషయంపై మొదటగా ధనశ్రీ స్పందించగా, తాజాగా చాహల్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఇన్ స్టాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.
మీరు లేకుంటే ఇలా జరిగేది కాదు
''ఫ్యాన్స్ సపోర్ట్ లేకుంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. వారి ప్రేమకు కృతజ్ఞతలు. అయితే ఈ ప్రయాణం 'ఓవర్'కు ఎంతో దూరంలో ఉంది. కానీ నా దేశం, జట్టు, ఫ్యాన్స్ కోసం ఇంకా ఎన్నో అద్భుతమైన 'ఓవర్స్' మిగిలి ఉన్నాయి. కుమారుడిగా, సోదరుడిగా, ఫ్రెండ్ గా, ఒక క్రీడాకారుడిగా ఎంతో గర్వంగా ఉన్నాను. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకోగలను. సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోన్న పోస్టులు నా దృష్టికి వచ్చాయి. అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇలాంటి ఊహగానాలను మీరు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేసుకుంటున్నాను.

ఇవి నాకు, నా కుటుంబానికి ఎంతో బాధ కలిగిస్తాయి. ఇతరుల మంచి కోరుకోవాలనే నా కుటుంబం నాకు నేర్పించింది. విజయానికి దగ్గరి దారులు ఎంచుకోను. అకింతభావం, శ్రమతోనే నేను విజయాన్ని ప్రయత్నిస్తాను. ఇలాంటి విలువలకే ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. నాపైన సానుభూతి కాకుండా ప్రేమ, మద్దతు చూపాలని కోరకుంటాను'' అని చాహల్ చెప్పుకొచ్చాడు.
కాగా, యూట్యూబర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, డెంటిస్ట్ అయిన ధనశ్రీ వర్మ, స్పిన్నర్ చాహల్ డిసెంబర్ 22, 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారంటూ ప్రచారం ఎక్కువైంది. కానీ అలాంటిదేమీ లేదని ఆ మధ్య చాహల్ అన్నారు. కానీ మళ్లీ ఇదే పుకార్లు మొదలయ్యాయి. దీనికి తోడు ఇప్పుడు చాహల్ తన ఇన్‌స్టాలో ధనశ్రీ ఫొటోలను తొలగించాడు. ధనశ్రీ, చాహల్ ఒకరినొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు. దీంతో ఈ డివొర్స్ రూమర్స్ మరింత ఎక్కువైంది.
మానసిక వేదనకు గురౌతున్నా
ఈ నేపథ్యంలో బుధవారం ధనశ్రీ వర్మ ఓ పోస్టు పెట్టింది. కొన్ని రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తల వల్ల తాను మానసిక వేదనకు గురౌతున్నట్లు పేర్కొంది. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్యం ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు చాహల్ కూడా స్పందించాడు.