హైదరాబాద్: న్యూజిలాండ్ బౌలర్‌పై టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పైచేయి సాధించాడు. అయితే ఈ పైచేయి క్రికెట్‌లో కాదు చెస్‌లో. మూడో టీ20 కోసం టీమిండియా, న్యూజిలాండ్ జట్లు రాజ్‌కోట్ నుంచి తిరువనంతపురానికి విమానంలో బయల్దేరాయి.
దీంతో విమానంలో యజువేంద్ర చాహల్, ఇష్ సోధి టైమ్ పాస్ కోసం రెండు చెస్ గేమ్స్ ఆడారు. చాహల్ ఎత్తుల ముందు సోధి చిత్తయ్యాడు. రెండు గేమ్‌ల్లో చాహలే గెలిచాడు. ఈ విషయాన్ని చాహల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
యజువేంద్ర చాహల్ క్రికెట్ ఆడటానికి ముందు జూనియర్ చెస్ చాంపియన్. ఇండియా తరఫున ఏషియన్, వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్స్‌లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే సరైన సమయంలో స్పాన్సర్లు దొరక్క పోవడంతో చాహల్ చెస్‌కు వీడ్కోలు పలికాడు. గతంలో ఛాంపియన్ అయిన చాహల్‌తో గేమ్ ఓడిపోవడంతో చాహల్ తన కన్నా చాలా తెలివైన చెస్ ప్లేయర్ అని సోధి అంగీకరించాడు.
ఇదిలా ఉంటే మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం తిరువనంతపురం వేదికగా మూడో టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. గత మూడు రోజులుగా అక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో మైదానంలోని పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.